Monday, 31 July 2017

!!! చెర !!!



సేద తీర్ఛే పచ్చని వసంతాలు
నిత్య సంగీతమై నాలో స్వరాలు...

కావ్యాలుగా మారే మది భావాలు
ఓదార్పు వీణపై చేస్తున్నా గానాలు..

విషాదచిత్రానికి ఆనందాల రంగులేసే
ఏకాంత భోగాన తలపుల  నేస్తాలు

పంజరాన చిలుకలా మసులుతున్నా
బదులు లేని ప్రశ్నలా మిగులుతున్నా...

అలజడుల ఆనవాలు తెలియకుండా
అలుపులేని మౌన గానం ఆలాపిస్తున్నా...!!

అనంత ఆర్తనాదాల మనోభావాలను
ఆనవాలు పట్టని అజ్ఞాతవాసం చేస్తున్నా..

అలోచిస్తే తోచే భయాలన్నీ వెలేసి
గడిచే క్షణాలతోనే సావాసం చేస్తున్నా...

అడుగు పడనీయక బంధించిన
చెరతోనే చెలిమిని చేస్తూ వస్తున్నా....

ఉదయాలు సాయంత్రాలు ఏకమై
కనులముందు కాలం కరిగిపోతున్నా...!!

ఊహించని వరమేదైనా ఉందేమోనని
నిరాశల సౌధాన ఆశల మొక్కల నాటి..
-
సాగు చేస్తున్నా ఆనందాల పూలు
తనివి తీరా ఏరుకునే రోజువస్తుందని...!!!

         అనూశ్రీ...

Wednesday, 26 July 2017

!! కలియుగం !!



కలియుగం కన్నీళ్ళయుగం
కలతలకు కష్టాలకు నిలయం
మంచివాళ్ళకు మమత పంచేవాళ్ళకు
నిరంతరం గండాల మయం...!!

మనిషి మనిషి లోనూ ఓ విషనాగు
స్వార్థంతో కొందరు  కొందరు
అసూయా ద్వేషాలతో కొందరు
కాలకూట విషం కన్నా ప్రమాదకరమై
మనలోనే మనతోనే సంచరిస్తున్నా
గుర్తుపట్టలేక వాళ్ళ కోరల చిక్కి
అమాయకంగా బలవుతూనే ఉన్నాం...!!

గాలి నీరు ప్రకృతి అంతా ఎప్పుడో
కలిషితాలతో విషమ జీవితాన్ని
అనారోగ్యపు శిక్షలు వేస్తూ
వైద్యం పేరిట వ్యాపారులైన వాళ్ళ
చేతుల్లో ప్రాణాలు పెట్టేసి
చావలేని బ్రతుకుని ఇస్తూనే ఉంది...!!

కనీసం మనుషులుగా మనలేక
సాటి మనుషులపైనే విషాన్ని
చిమ్ముతూ పాములకన్నా ఘోరమైన
మానవ మనస్తత్వాలను
పాపాల ప్రవాహాలను చూసి
ప్రాణాలను హరించ వచ్చిన

ఆ యమకింకరుణికి కూడా ఆశ్చర్యం
కలగడంలో వింతేమీ లేదేమో.....!!
ఎందుకంటే అంతకన్నా దారుణాలు
నేరాలు ఇలలో కనబడుతూంటే
యమలోకాన్ని మించి భూలోకమే
భయకంపితులను చేస్తూ కొనసాగుతోంది..!!

          అనుశ్రీ....

శుభోదయం

శుభోదయం ఈమాట  అనడం
జీవితంలో ఒక భాగమైపోయింది
ఒకప్పుడు ఒక్కరిద్దరు ఇప్పుడు
ఎందరో ఎందరెందరో.....!!

అయినా సరే ఎన్ని సార్లు విన్నా
ఎంత మంది చెప్పినా సరే
ఆత్మీయతని పంచే మనసు
పలకరించిన వేళ కలిగె ఆనందం
ఆస్వాదించే మదికే తెలుస్తుంది....

ఏ పలకరింతలూ లేని నాడు
ఏ పిలుపులూ నను తలవని రోజు....
ఎడారిలో వానచినుకులా
వేసవిలో మరుమల్లిలా......

సుప్రభాతాల వేళ సున్నితంగా
ఆలోచనల  అగాధాల్లోంచి
తట్టిలేపి హాయి సమీరాలతో
ఉత్సాహపు ప్రోత్సాహపు అనునయాల
నను మేలుకొలిపిన  ఓ పిలుపు

ఓదార్పులా ఓ మార్పులా
ఇన్ని స్నేహాలకు బంధాలకు
నాంది పలికిన ఆ చెలిమిని తలుస్తూ
ప్రతిరోజు నేనెదురు చూస్తుంటాను
ఉషోదయాన  తొలి పలకులకై..!!

నీ పిలుపు నాకు చేరినపుడే అనిపిస్తుంది
వెలుగులు ప్రసరిస్తున్నాయని
మరో రోజు శుభంగా ప్రారంభమైందని
నవ్వుతూ నా దినచర్య సాగాలని...!!

           అనుశ్రీ.....

Sunday, 23 July 2017

!! సహజత్వం !!



సహజత్వపు నవ్వులకు
స్వచ్చంగా పూసే పువ్వులకు
చోటెక్కడుందివాటికోసం
అలమటించే  కొందరి మనసుల్లో తప్ప...!!

వేచి చూసే సమయమెక్కడిది
కృత్రిమమ సుమవిహారాల జతకలిసాక
మొక్కను నాటి నీరు పోసి పూలకై చూసి
మురిసే అనుభూతులేనాడో అంతరించాయి

మనసు నిండే పరిమళాల మాటేది
అసహజ వర్ణలే అందవుతుంటే
పూల గంధాలెవరికి కావాలి
రంగు సిసాల్లో ఇంకిన సెంటు చాలు
మనసారా నవ్వే  రోజులు
కల్మషం లేని మనసుల పలకరింతలు
స్వార్థం అంటని స్నేహాల జాడేది......!!

ఎక్కడో దూరంగా విసిరేయబడి
చేతులు చాచి అలమటిస్తూ
నిరాశలై నిట్టూర్పులై
పరిసరాలకు దూరంగా చరిస్తూ
అబద్దం అంటని మాటలు నేర్వని
అమాయకమైన పసితలపుల్లో
ప్రకృతి ఒడిలో సేదతీరే
మూగజీవాల మౌన భాషల్లో తప్ప.....!!!

              అనుశ్రీ.....

!! నిశీధి వెలుగులు !!


నేవేచిన వేళ  నీమది తలచే వేళ
ఏవేళ నీవొచ్చినా స్వాగతం
పలకాలని  నిశీది నీడన
ఆశల దీపాలు వేలిగించి
నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నా...!!

నీఅడుగులు ముంగిట చేరే క్షణం కోసం
వాకిట ముగ్గునై గుమ్మాన తోరణమై
చేసిన బాసల సాక్షిగా పడిన బంధం తొడుగా
మూడు ముళ్ళను ఏడడుగులనూ తలుస్తూ
కలల కనే కళ్ళను కావలిగా కట్టేసి
ఏకాకినై  ఎడారిలా ఏడుస్తూనే ఉన్నా....

నిద్దురపోని మనసును నిరాశగా కొలుస్తూ...
నిక్షిప్తమైన జ్ణాపకాల బరువుని మోస్తూ
కరుగుతున్న కాలాన్ని నలుగుతున్న నవ్వుని
అనునయిస్తూ నీ ఆలోచనల్లో తరిస్తున్నా...

అడుగులతో చేరవలసిన దూరాన్ని
అందనంత దూరంగా విసిరిన కాలాన్ని
నిలదీయలేక నిలిచిపోయిన ప్రతిమలా
వచ్చే వసంతాలకై నిత్యపూజలు చేస్తూనే ఉన్నా.....!!

          అనుశ్రీ.....

Friday, 21 July 2017

!! యువత--దేశభవిత !!



కుటుంబ గౌరవాన్ని దేశభవిష్యత్తును
పురోగతిలో తీసుకెళుతూ
ఉన్నతశిఖరాలు అధిరోహించాల్సిన
ఎంతో భవిత ఉన్న యువత......!!

చెడు సహవాసాల ఉచ్చులలో
అక్రమార్జనలు చేసే నీచుల నీడలో
ఉనికిని మరిచి ఉన్నతిని మరిచి
క్షణకాలం పొందే ఆనందం కోసం
జీవితకాలాన్ని కోల్పోతూ
కన్నవారి పాలిట శాపాలై
నేరాల చెరలో బందీలుగా
నలిగి  బలైపోతున్నారు........!!

తాము తిన్నా తినకున్నా
బిడ్డలు ఎదిగితే చూసి మురవాలని
ఉన్నత స్థాయిలో  అందరికీ మేలు
చేస్తుంటే తనివి తీరా చూడాలని
ఎన్నో కలలను కన్నీళ్ళ పొరల దాచి...
సంతానం పొందే ప్రగతికై ఎదురుచూసే  తల్లిదండ్రుల తీరని ఆశలన్నీ
ఎండమావులైై మిగులుతున్నాయి..!!

కొత్త లోకపు వింతపోకడలను
అర్థం చేసుకోలేక వినోదమే
ప్రధానమనే భ్రమలో
మాదకద్రవ్యాల మాయలోపడి
వ్యసనాలకు బానిసలవుతూ
రంగుల లోకంలో విహరిస్తున్నామని
తుదకు రెక్కలు తెగిన పక్షులై
జీవితాన్నే చేజార్చుకుని
ఎందుకూ పనికిరాని వ్యర్థాలుగా
సమాజానికి చీడపురుగులుగా
ఏ ఉపయోగమూ లేక రాలిపోతున్నారు..!!

బంగారు భవితవ్యం మీ ముందుంది
సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి
విలువైన సమయాన్ని అరుదైన అవకాశాన్ని
తీరైన తోవగా మలుచుకుంటూ సాగితే
గగనపు అంచులని తాకొచ్చు మేథస్సుతో
యువతంటే  వ్యసనాల బానిస కాదు
దేశభవిత అని చాటిచెప్పే సత్తాదాగుంది
పరిశీలిస్తే కనిపిస్తుందది మీకు మీ లోనే...!!

             అనుశ్రీ....

!!! వృధ్దాప్యం !!



వయసు పెరుగుతోందంటే దిగులు
అనారోగ్య సమస్యల గుబులు
అసహనం.. అయ్యో అయిపోతోందా
ఇక నా జీవితం అనే ఓ నిరుత్సాహం
అన్నీ కృంగదీసి బాధిస్తుంటే
పేద సంపన్న తేడాలేక అందరికీ భయమే.....

కానీ అయిపోలేదు జీవితం ఉంటుంది
అయిన వాళ్ళ నిర్లక్ష్యాలను భరించాలి
అరిచినా హేళన చేసినా సహించాలి
నిరుపయోగమైన నిలువవు నీవంటూ చూసే చూపులను క్షమించాలి...!!

నీ త్యాగాలు నీవందించిన భోగాలు
కష్టాలను దాటి కన్నీళ్ళను దిగమింగి
నీపై ఆధారపడ్డ జీవితాలన్నింటికీ
జీవం పోసే క్రమంలో ఆవిరైన
నీ కలలు, ఆశలు ,ఆశయాలు ఏవీ
చూసే తీరికలు నీవాళ్ళకు లేవు....

వయోభారంతో వేసే నీ అడుగులకు
బలమయ్యేందుకు ఊతకర్రలు తప్ప
ఆత్మీయ హస్తాలు అనుక్షణం ఉండవు
ఉన్నా నీ ఆత్మాభిమానం ఒప్పుతుందో లేదో

ఎన్నింటినో అధిగమించిన నీ మనోబలం
ఎందరినో సమాధాన పరిచిన నీ తెలివిని
ఇక నీపై నీకోసం వినియోగించితే
నీవే నీకు బలమవుతావేమో....

అందరూ నడిచినదే ఈ దారి....
నీ కన్నా ముందు వాళ్ళు....
రేపు నీ వెనకాల వచ్చేవాళ్ళూ...
అంతా చివరికి ఈతోవన వెళ్ళాల్సిందే..

వృద్థాప్యం మరో బాల్యంలాగా
అనుభవాల సారం లాగా
ముసలితనాన్ని ఈసడించే కళ్ళు ఏడ్చేలా
నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోతూ
పరిపూర్ణమయిన ప్రయాణానికి సాక్షంగా
ఆస్వాదించాలి ప్రతీరోజూ
ఎందుకంటే రమ్మన్నా రాదు మళ్ళీ ఈరోజు

సేవలో పొందే తృప్తి,శాంతి అనుభవిస్తే
ఒక ఆత్మసంతృప్తి మనకు మిగులుతుంది
అది మనసుతో చూస్తే తెలుస్తుంది
ఆ సేవకూడా వరమే అనిపిస్తుంది
గుర్తించకపోవడం ఎదుటి వాళ్ళ ఖర్మ
అది తెలుసుకోని వాళ్ళకై మీ వేదన వృధా....!!

                    అనుశ్రీ....

!!!!! లైక్ !!!!!



ఉత్సాహాన్ని పెంచేందుకు
ఇష్టాన్ని తెలిపేందుకు
నచ్చిందని చెప్పేందుకు
మెప్పుని అందించేందుకు
అన్నిటికీ ఉన్నది
ఒకే మంత్రం  లైక్ అనే ఇష్టం....

క్షణంలో మనసులోని భావాన్ని
ఎదుటి మదికి చేరవేసేలా
ఒక మాటైనా తెలపకుండా
స్పందనై తెలిసేలా
మౌనంగా తెలిపే వేళ్ళ భాష
రెప్పపాటులోని ప్రశంసని చిటికలో చేరవేసి
స్నేహానికి ప్రతీకలుగా చేసే
నెట్టింటిలో ప్రతి ఒకరికి
అందుబాటులో ఉండే సాధనం....!

మంచికై మనోవికాసానికై సాహిత్యానికై సేవకై
విజ్ఞానాల చేరవేతకై ఓటులా వాడాలి ఆయుధం
పోటీకాదు అద్భుతమూ కాదు
చెప్పే మంచేదో చెప్పేసి
మాయా నుండి బయటపడి
మేలుకుంటే ఉత్తమం
అందుకోసమై వృధాకారాదు
విలువైన సమయం...!!

            అనుశ్రీ...

Thursday, 20 July 2017

!! వసంతం !!


మనసు వనానికి
వసంతమేదో వచ్చీంది......!!
మౌనమైన నా గొంతులో
కొత్తస్వరమేదో తొణికింది.....!!
అందమైన  ఋతువులోని
తొలి చివురుల దరహాసంలా.....!!

పలకరింతల సందడులలో
మురిసే సమీరాల  కోలాహలంలా...
పండగేదో వచ్చింది పరువానికి
వలస వచ్చిన వనమాలివై
వలపుల నిధి వారధివై నువు నడిచొస్తుంటే
తొణకని నీ చూపుల జల్లులో తడిసిపోతున్నా,.

పసిడి పూల  సుమ మాలికలతో
పరవశాల పచ్చని పొదరింటిలో
నీ ఆరాధనే మదిని మెదిలుతుంటే
నీ అడుగుల సడి నీవొచ్చేజాడ తెలుపుతుంటే
చేతులు చాచి పిలుస్తున్నా
నా ఆత్మీయ నేస్తాన్ని  అనురాగ హస్తాన్ని..!!

                అనుశ్రీ.....

!! స్వర్ణకారులు !!

కనిపించే నవ్వుల వెనక
కనిపించని నిజాలను దాచి
చుక్కలనైనా నేలకుదింపే
చక్కనైన కళాకారులు.....!!

చిన్న చిన్న అతుకులతో
చిత్రాలను సృష్టించి....
సూదంటు చూపులతో
సౌందర్యాన్ని పండించే
సాటిలేని  మేటి కళాకారులు...
ప్రతిభతో మెరిసేటి మణిపూసలు....!!

హంగులు కూర్చి అందాలు దిద్ది
ఆభరణాలతో శుభకార్యాలలో
అత్యంత రమణీయ సొగసుల కూర్చి
మగువల మోములో కాంతులు నింపి
ఆకలి దప్పుల మరిచే
అరుగుమీది కర్షకులు.....!!!

కష్టాన్ని మరిపించే ఫలితం అందక
నష్టాన్ని చెప్పుకునే దారే తెలియక
అలంకారాలకు వర్ణాలు అందిస్తూ
ఆనందానికి ఆమడ దూరనే ఆగుతున్న
శ్రమని  నమ్మిన శ్రామికులు

సొమ్ములు చేసి సొమ్ము చేసుకునే నైపుణ్యం
వమ్మవుతున్న నమ్మకమై దీనంగా చూస్తుంటే
రత్నాలు రవ్వలు కెంపులు పచ్చలతో
కళకళలాడిన  కళాకారుల కళ్ళు
పుత్తడి రంగేసుకున్న ఇత్తడి వగల చూసి
చిత్తయిపోయి చిధ్రమవుతుంటే...

ప్రావీణ్యతనంతా వ్యాపారులకే అందించి
నైరాశ్యానంతా దోసిట్లో నింపుకుని
కడుపు నింపలేని పనితనాన్ని
కసితీరా తిట్టుకుని
మరో రోజు పనికోసం పడిగాపులు
మారని నిజాలపై నిట్టూర్పులు.......!!

         అనుశ్రీ...

!! రాలిన నవ్వులు !!



ఎన్నిప్రాణాలను బలితీసుకున్నా
ఎన్నిగుండెలు ఆవిరైనా
ఎన్ని కడుపుకోతల చవిచూసినా
ఇంకా కళ్ళు తెరవక చూస్తున్నాo చోద్యం..

అభం శుభం ఎరుగని పసిపువ్వులు ఎన్నో.
నరకబాధ చవిచూసి అంతరించిపోతున్నా
 భయానక ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతున్నా...

ఎదుర్కున్న ప్రతిసారీ ఏడుస్తూ
గడిచాక మళ్ళీ మైమరుస్తూ
నిర్లక్ష్యాలకు మూల్యంగా
అమ్మల ఆక్రందనలను చెల్లించి
సేదతీరుతున్నాయి అందలమెక్కిన
అధికారపు వైఫల్యాలు.....!!

పంటపొలాలకోసం  వేసిన బోర్లు
కష్టం తీర్చకపోగా మరింత నష్టాన్ని
పూడ్చలేని శోకాన్ని అందిస్తూ
వేదన నిండిన గుండెల గునపాలుగా
మానని గాయాలు చేస్తున్నాయి....

పంటకై పడిన ఆరాటం
కడుపు పంటను దోచుకుని వేళుతుంటే దిక్కుతోచక దీనంగా చూసి భరిస్తూ
కడివెడు కన్నీళ్ళుగా ఆశల్ని వదులుకుని
కరువు తీరని బెంగని అరువుకి తెచ్చుకుని
రోదించే హృదయాలకు విశ్రాంతి ఎప్పుడో..

పసిమొగ్గలని ఏరుకునే దేవుడికి
నిర్లక్ష్యంగా నిద్రించే కన్నవాళ్ళకు
కళ్ళుమూసి చూస్తున్న నేతలకు
చైతాన్యాన్ని వదిలిన మనకే తెలియాలి...!!

                  అనుశ్రీ....


!! చివరి మలుపు !!

అమ్మా అని పిలవడం ఎంత అదృష్టమో
పిలిపించుకోవడమూ అంతే అదృష్టం..
ఆ ప్రేమలోని మాధుర్యాన్ని
తనివితీరా చూడాలంటే
ఒక జన్మ సరిపోదేమో అనిపిస్తుంది...
అమ్మగా జీవించడంలోని ఆనందం..
లోకాన్ని మరిచి విహరించే స్వర్గం..!!!

పిల్లల బోసినవ్వుల్లో విరిసే పువ్వులు
వచ్చీరాని మాటల కబుర్లు
పసితనపు గారాబాలు....
వాళ్ళ కథలో కథా నాయిక అమ్మే
అమ్మగా మారాకే నిజంగా
అమ్మ ప్రేమంటే తెలిసేది...........!!

పిల్లలని తీర్చిదిద్దడంలో ప్రథమస్థానం
వాళ్ళ ఎదుగుదలకై పడే తపన
వృద్దిలోకి తేవాలని ఆరాటం
ఆణిముత్యాలుగా చూడాలనే అభిలాశ
భవిష్యత్తు బంగారం చేయాలనే ఆశ
ప్రతీ తల్లి మదిలో నిరంతరం కలవరం....!!

చూస్తుండగానే భవిష్యత్తు పరుగులో దూరమైన వేళ వారించలేక ఊరుకోలేక
ఆ తల్లి పడే  ఆవేదన వర్ణనాతీతం
కళ్ళముందు ఆడిపాడిన పసితనం
ఎక్కడో ఒత్తిడిలో నిర్విరామ శ్రమలో
కనిపించడమే వరమై కలవరింతల పరమై
బాల్యపు గుర్తులనే ఆసరా చేసుకుని
మనసుని ఆదీనంలోకి తెచ్చుకోవటమే పని..

ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని
సంతోషంగా గడపాలని
కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ
కలతలని కడుపులో దాచుకుని
వాళ్ళు మిగిల్చిన వెలితిని
జ్టాపకాల పేజీలో అక్షరాలుగా మలచుకుని
కలిసిన రోజులని ఆస్వాదిస్తూ
ఆశీర్వదిస్తూ కొనసాగడమే
  అమ్మకు  మిగిలే చివరి మలుపు....!!

       అనుశ్రీ....

Sunday, 16 July 2017

~~~తలపు~~~



ఒక చిరునవ్వు పూస్తుంది
నా పెదవుల పై మల్లికలా
నీ రూపం మదిలో మెదలగానే
నీ తలపు సడి నను చేరగానే....!!

కొన్ని సాయంత్రాలు కొన్ని రాత్రులు
పంచుకున్న పచ్చని వసంతాలు
గుబాలించిన నీ మనసు పరిమళాలు
మెత్తగా నన్ను తడిమేసిన భావన
ఏకాంతంలోనూ నన్నొదలని నీ ఆలోచనలు
వదలడానికి మనసే రాని మధురిమలు...
మెలకువలోనూ నీకై  కలవరింతలు....!!

చిలిపి చూపులతోనే నువ్వు చెప్పే
తీయని గుసగుసల పదనిసలు
మౌనంగా శ్రద్దగా  ఆలకించడంలో
లీనమైన నీ ఆధీనమైన నా మది.......!!
చింతలన్నీ మరిపించే
నీ చిరు మందహాసానికి
దాసోహమైన నా వలపు తరంగం
నీ ఒడి తీరానికి చేరాలంటూ తపిస్తోంది...!!

              అనుశ్రీ.....

ప్రయాణం......

!!

నా జీవన ప్రయాణంలో
ప్రతిరోజూ నువు తారసపడుతున్నా
చివరిదాకా తోడు రావేమో అని
అనిపించినపుడల్లా ఆగిపోతున్నాను...

మళ్ళీ వస్తావు అన్న ఏదో ఆశతో
 నడక  కొసాగిస్తున్నాను.....
నువు చేయి వదిలిన ప్రతిసారి
ఒంటరి తనాన్ని వెలేసేందుకు
చమరింతల సాయాన్ని కోరుతున్నాను...

ప్రతీరేయినీ కనురెప్పల మాటున దాచి
రేపటి వేకువలో నీ రాకకై
వెర్రిగా ఆశపడుతూనే ఉన్నాను...
నిరాశల హాలాహలాన్ని
పెదవులపై తీయని దరహాసంగా అద్ది
 నీ నవ్వుల పువ్వులకై
నిత్యం నేను నలిగిపోతూనే ఉన్నాను...!!

                అను---

!!చిగురు!!



కొత్త ఆశలు చిగురించేలా
ఆశయాలు  ఫలించేలా
బ్రతుకు బండిని చైతన్యం చేసుకునేలా
బాధల్ని తరిమేసి భయాలని వెలేయాలి...!!

నిత్య నూతనమైన వెలుగుల పయనానికై
సంతోషాల ఇంధనం కావాలి
స్వచ్చత రంగులతో విరబూసిన
నవ్యమైన నవ్వుల పూలు విరియాలి...!!

విషాదంలో పండిన ఆకులు రాలి
నిత్యనూతన శోభలలో  మురిసే
సంబరాల రెమ్మకు తొడిగే
పచ్చనైన వసంతం కావాలి....!!

రేపటి భవితకై  నేడు మొలకెత్తి
నీడని పంచే పూల తీగల పందిరిలా
అందరి మనసులూ జతగా కలుస్తూ
మంచి మనసులు మనలో మేలుకోవాలి...!!

       అను-----

     36

కొత్త



జీవితంలోని ప్రతీ మలుపు
నన్ను నాకు చూపిస్తూనే ఉన్నా
ఇంకా నాకు నేను కొత్తగానే కనిపిస్తున్నా...!!
ఎన్నో అనుభవాలు మరెన్నో అనుభూతులు
ఇంకేవో  పరిచయాల ప్రభావాలు
అనుసరించి నను పలకరిస్తున్నాయి..!!

నా మనసున ఉన్నది నేనైనా
కొత్త భావాల అమరిక
నవ్యమైన రంగుల రూపమై
మళ్ళీ మళ్ళీ తెలియని
నన్నే  తెలుపుతోంది...!!

పాఠాలు నేర్పిస్తున్న ప్రతీ సందర్భం
మార్పుని కోరుతూ సాగుతుంటే
ప్రశ్నగా-సమాధానంగా ప్రేమగా-ద్వేషంగా
సందర్భోచితంగా నాకు నేను కనబడుతుంటే.!!

గమనంలో గమ్యంలో సరైన దారిని నడుస్తూ
నాకు నేను తారసపడిన ప్రతిక్షణం
మంచి మమతల నడతకు రూపంగా
నన్ను చూసుకోవాలనే ఆరాటపడుతున్నాను...!!

              అను-----

        37

!!ఉద్యోగ-సమరం!!


చదివిన చదువుకు
సార్థకతని వెతుకుతూ
సాగించే పయనంలో
అతివకు అగచాట్లు ఎన్నో..
నాటిలా  కాదు మేము
నేటి   మహిళలమంటూ
బయలుదేరిన మగువకు
ఇంటా బయటా తప్పనేలేదు
అధికార దురహంకారపు వేధింపులు...!!

బాధ్యతలతోనే బంధుత్వం
 సేవలతోనే స్నేహం...
క్షణమైనా తీరికలేని
ఒత్తిడులతోనే సావాసం...
విసుగులూ చిరాకులే
బహుమానాలై  చేరుతుంటే
ఆత్మాభిమానం ఆక్రందనంతా
ప్రశ్నగానే మిగిలిపోతోంది...!!

కాసులు లేనిదే గడవని కాలం
సంతానం సంసారం సజావుగా
నడిపే ఆరాటంలో
జీతాలకు నెలవైన చోట
జీవితాన్ని తనఖా పెట్టి
జీవనశైలిని గడియారం ముళ్ళులో బిగించి
 కాలంతో పరిగెత్తే మహిళా...
నీ చేతులు రెండైనా చేతలు పలుగా..
నిత్యకృత్యమైన నీ పరిక్షలో
ఉత్తీర్ణత  ఎంత ఉందో గానీ
ధరిత్రికి సమం నీ సహనం...!!

       అను------

    39

కారణం

Pencil sketch :
కవిత courtesy : అను. , source :  Vijaya Bhanu (my daughter)
!!కారణం!!
గుండెని మెలిపెట్టే బాధ
కళ్ళలో పొంగుతున్న కన్నీళ్ళు
జ్ఞాపకాల పేజీ తిప్పగానే
అవమానాలను గుర్తుచేసి
మనసు గాయం మరోసారి
అనుభవిస్తోంది మౌనవేదన...!!

ముసుగులోని స్నేహం
అబధ్ధమని తెలిసినా
అడ్డు చెప్పక అంగీకరించి
మదిలో వ్యథలు,రొదలు
రెట్టింపైనా భరించి
జరిగినవన్నీ జరగలేదని
ఒప్పిస్తూ మర్చిపోవాలి...!!

అంతరాత్మ పెట్టే హింసనైనా
పెదవులపై నవ్వులాగే ఒలికించాలి
స్వార్థం ముందు స్వాభిమానం
తలొంచనన్నా సరే
స్థితిగతుల బేరీజు వేసి
తప్పదని మెప్పించాలి....!!

నా భావాల ప్రదర్శన నేరం కనుక
పరిష్కారం నేనే అని తప్పుకుంటే
అంతా ఆనందమే..అన్నీ అభిమానాలే
అప్పుడు ఎవరికీ నేను కారణం కాను....!!

- అనుశ్రీ

~~~ఉగాది శుభాకాంక్షలు~~~



మావి చిగురు పలకరింతలు...
కోకిల గానాల కచేరీలు......
వేపపూల పలకరింతలు....
లేతమామిడి వగరులు.....
పచ్చగ మెరిసే తోరణాలు
అన్నీ కలిపి ఆస్వాదించమనే
అచ్చమైన స్వచ్చమైన పండగ ఉగాది
తెలుగు లోగిళ్ళలో ఆనందాల పునాది.....!!

జీవితంలోని ప్రతీ రుచినీ
ఆనందంగా స్వీకరించమని
ఆత్మీయంగా ఆహ్వానించమని
చేదునీ తీపినీ సమంగా చూడమని
ఎన్నో భావాల కలబోతే జీవితమని
చాటి చెప్పె  ఆచారాల  విరిబోణి....,!!

ఇంటింటా దీపకాంతులు
పూల గంధాల పరిమళాలు
ప్రకృతినోసారి తలచుకోమంటూ
సాంప్రదాయపు సందేశాలు....
నూతన సంవత్సర ఆగమనంతో
ఆశల కొమ్మకు వేసే అంకురాలు
జాతకాల మంతనాలతో
కొత్త కోరికల కోలాహలాలు.........
భవిష్యత్ ప్రణాళికల తతంగాలు
మంచిని ఆశిస్తూ పొందే ఆశీర్వాదాలు....

ప్రతీ మనసులో ప్రశాంతమై ఆవహిస్తూ
ప్రతీ రోజు చూడాలి ఆనందమయ ఉదయాలు...!!

     అనుశ్రీ....
       64

***శ్రీరామ నవమి శుభాకాంక్షలు***



రామనవమి తలచిన ప్రతిమదినీ
పవిత్రం చేసే పర్వదినం
ఏడాదికోసారి  మనలని దీవించే
సీతారాముల చల్లని చూపుల వీక్షణం....

ఆడినమాట తప్పని సత్యనిరతి
తల్లిదండ్రులపట్ల ఎనలేని భక్తి
శౌర్య పరాక్రమాలతో  ఇచ్చిన అభయం
ప్రజలు కొలిచే రాజు కాదు
ప్రజలని ప్రేమించడమే పాలనంటూ
చాటిచెప్పి రామరాజ్యాన్ని నిలిపిన ఆదర్శప్రాయుడు కోదండరాముడు..
సకలగుణాభిరాముడు శ్రీరాముడు
సౌశీల్య సహనాల విరిసిన సీతమ్మ
రామనామమే ధ్యేయమైన హనుమ
కలనైనా అన్నను విడని లక్ష్మణుడు
ఎంత చదివినా తనివితీరని రామాయణం
మనసుని మధురం చేసే రామకళ్యాణం
భక్తిభావనల మదిని నిలిపి చూపే
అపూర్వమైన ఆనందదాయకమైన దృశ్యం
 సీతారామ కళ్యాణం కనులారా కాంచి
అందరం పునీతులమవుదాం
మది మందిరాన నిలిపి పూజించుదాం....!!
      ......అనుశ్రీ....
               

!! మనసు !!

Pvr Murty  గారి చిత్రం...

!!! మనసు !!!

నిజంగా నీ అంత ఇష్టం నీ అంత ప్రేమ
ఎవరు చూపిస్తారు నాపై
ఎవరికీ తెలుసు నేనేంటో
ఎవరికి తెలుసు నాలో అలజడెంతో....!!

మౌనంగా రోదిస్తూ నా కన్నీళ్ళని తుడుస్తూ
ఉలిక్కి పడి లేచిన ప్రతిసారి ఫరవాలేదని...
అస్తమిస్తున్న ఆశలకు ఆయువు పోస్తూ...
నన్ను కనిపెట్టుకుని నా కలలన్నీ పట్టుకుని..
తీరం చేర్చే దిశగా అడుగులు వేయిస్తూ..

నిద్రని వెలేసిన ఎన్నో రాత్రులలో
నన్ను నాకు పరిచయం చేస్తూ..
ఆవేశాన్ని అణచివేస్తూ
ఆక్రందనలని అనునయిస్తూ..
ఎన్ని వేల సార్లు మరణించావో
నన్నిలా బ్రతికించేందుకు.......!!

ఎన్ని సార్లు ముక్కలయ్యావో
నేను ఓడించిన సమయాలను తలచి....
ఎల్లలు లేని నీ ఆలోచనల సమీరాలని
నాకోసం గిరిగీసుకుని
నలుగుతూ నడిపిస్తున్న నిన్ను
నాకేమవుతావో ఎలా చెప్పను....!!

సంతోషాల ఊయలలో ఊగినపుడు
నవ్వుల జల్లై మురిసి పోతూ...
విషాదాల వేటుకి గాయపడినప్పుడు
ఓదార్పు వై సేద తీర్చుతూ....
కాలానికో మనిషిని హితులంటూ చూపితే
ఏడుస్తూ తిరస్కారాల శాపాలు భరించి..
నాతో పాటే నడిచి అలసి సొలసినా
నను వీడలేక నాతో పయనిస్తున్నావు...!!

విశ్రమించే తరుణం ఆసన్నమైనపుడు
మట్టిలో సైతం తోడొచ్చే నేస్తానివి
నాతో కలిసి అంతరించే అంతరంగానివి
పేరు అడిగితే  ఏమనగలను
నాతో పాటే పుట్టిన నా మనసువననా
చూపించమంటే నాలోనే ఉన్నావని
నన్ను నాలో చూసుకుని మురిసిపోనా....!!

         అనుశ్రీ...

           118

కిరణ్

.....  శుభాకాంక్షలు.....

మనసొక అందాల పూలవనం
మాటొక మధుర మకరందం
ఆప్యాయతకు తొలి అడుగు
మంచిలో ఉండే మొదటి పేరు....!!

నిశ్చలమైన మది నీది
నిర్మలమైన ప్రేమ నీది..
కల్మషాలు అంటని మనసు
కలుషితాలు ఎరుగని మాట...
నిస్వార్థమైన అనురాగానికి
అసలైన చిరునామా నువ్వు........
మా అందరి ఆనందాల లోకం నువ్వు...

బంధాలను నిలబెడుతూ
కష్టంలో చేయూతనిస్తూ
సాయానికి సదా సన్నద్దమవుతున్న
నిన్ను చూసి నిత్యం ఆనందిస్తున్నాం
ఇలాగే  దినందినం ఎదగాలి
నువు ఎంతో  ఉన్నతంగా...
నిను చూసి మురవాలి మేమంతా గర్వంగా...!!

ప్రియమైన తమ్ముడికి జన్మదిన         శుభాకాంక్షలు.....

    అనుశ్రీ......

!! మరబొమ్మ !!



ఎన్నో కథలు ఎన్నో కవితలు
ఎన్నో ఉద్యమాలు-మరెన్నో  ఉద్వేగాలు..

తరాల అంతరంతో మా తలరాతలు
మారుతున్నా
మారవలసిన జీవితాలు మరెన్నో
అబలగా బలౌతున్న గాథలింకెన్నో.....

ఆటల్లో పాటల్లో దేశఖ్యాతిని విస్తరించి
శాంతి కామికగా- దేశ సేవికగా
ఆకాశానికి దూసుకెళుతున్నా
ఇచ్చిన ప్రతీ పాత్రనీ
గొప్పగానే పోషిస్తున్నా.........!!

ఎందుకో మీ దాకా వచ్చి ఆగిపోతున్నాం....
మన్ననకై  ప్రేమకై  మీ  క్షేమానికై తపిస్తూ...
మమ్ముల మేము తగ్గించుకుంటూ
మీ ముందర నిలబడ్డాం...

వంచించినా పంచన చేరుతున్నామని
కీలుబొమ్మలుగా మమ్ము చూసే
ఈ సమాజం మారి
మనుషులుగా గుర్తించి మంచికై యోచించే
రోజు రావాలి...
ఉనికిని కోల్పోయి మరబొమ్మలై జీవిస్తున్న
ఇంకా ఎందరో అతివ బ్రతుకులు మారాలి
అందుకు మనసున్న ప్రతి ఒక్కరూ
మార్గం చూపాలి.....!!

        అనుశ్రీ.....
           

!!!!! నాన్న !!!!!



నిన్నటి గతం నాన్న
రోజూ ఒక జ్ఞాపకం నాన్న
కలలో తప్ప కళ్ళకు కనబడక
దిగులులో బెంగలో
మరీ మరీ తలపుకొచ్చే నాన్న...
గుర్తులుగా  మాలో మెదులుతూ
ఎక్కడో నువ్వు ఇక్కడే మేము...!!

నువ్వుంటే నాలో భయాలు జడిసేవి
నువ్వుంటే లోకం అందంగా కనిపించేది
నీ పచ్చని  నీడలో కాలం హాయిగానం చేసేది
మాలో పసితనం వాడక విరబూసేది...!!

బాధ్యతలన్నీ మోసే భరోసాని చూసుకుని
అమ్మ లో ఆనందం కనిపించేది
కొండంత అండలా నీ మాట
సాటిలేని మమతలా నీ దీవేన.......!!

సమయం గడుస్తున్నా సమసిపోని
అనంతమైన అనురాగం నీది
నీ ప్రేమలో మురుస్తూ
గడిపేకాలం ఈ జన్మకు లేదు
నువ్వు వదిలి వెళ్ళిన స్మృతులు
నీతో గడిచిన ఆ రోజులు
ఇవే మాకున్న ధనం

కనిపించని దైవంలా లోకాన్ని వీడినా
నీ కరుణామృతంతో మము నడిపించు
తీరైన తోవలో పయనించే బలమివ్వు
మాలోనే నువ్వున్నావన్న ధీమానివ్వు.....!!

              అనుశ్రీ.....
               132

~~~~పర్యవేక్షణ~~~~



పర్యావరణ పరిరక్షణ
అంటే కేవలం చెట్లను నాటడం
మాత్రమే కాదు ఇంకా ఎన్నో
పాటించడం మన అందరి బాధ్యత....!!

ప్రకృతిలో మనమూ ఒక భాగమే
మన ఉనికిని కాపాడుకోవడం మన ధర్మం
మరిచిపోతూ ఇప్పటికే తగినంత
మూల్యం చెల్లించుకుంటున్నాం.......!!

నడిచే దూరానికి కూడా వాహనాల వాడుక
పెద్ద పెద్ద శబ్ధాలతో చెవులను హింసించడం
అన్ని అవసరాలకు ప్టాస్టిక్ సంచులను
వాడడం అవసరం తీరగానే పారేయడం...!!
రోడ్ల పక్క స్థలాలను విచక్షణా రహితంగా
నడవడానికి కూడా వీల్లేకుండా చేయడం...!!

అద్దెలకోసం కనీసం నడవడానికి కూడా
సరిగ్గా లేకుండా నేలను నింపేయడం...!!
నీటిని అవసరానికి మించి వాడుతూ
వృధాగా పోనివ్వడం......!!
దీపావళి వచ్చిందంటే వేల ఖర్చుతో
టపాకాయలు కొని పిన్నా పెద్దా అంతా
ఆకాశాన్ని కూడా పొగతో నింపి
అనారోగ్యాలతో  అలమటించడం

ఇవన్నీ మనం తెలిసి చేసే తప్పులు....
వీటిని దిద్దుకునే కనీస ప్రయత్నం చేస్తే
మనం నిజంగా ప్రకృతి ప్రేమికులమవుతాం..
భవితను కాపాడుకునే పరిరక్షకులవుతాం..!!
           
                   అనుశ్రీ...
                   
                     

~~~తొలి అడుగు~~~



ఎన్నో సందేహాలు ఏవో ఆందోళనలు
ఎన్నో ఆశలు మరెన్నో ఇష్టాలు
గడప ముందుకు రాగానే ప్రశ్నిస్తున్నాయి
ఏవి వదిలేయాలో ఏది వెంట తెచ్చుకోవాలో
తేల్చలేని మనసు తికమక పడిపోతోంది...!!

ఆప్తులను ఆప్యాయతలను వదిలి
ఇంటిని ఇంటి మనుషులని వదిలి
సంతోషంగా స్వచ్చంగా ఉండగలనా
అని మదన పడే  నా అంతరంగం

కష్టాన్ని  కళ్ళలోనే దాచుకోమని
కన్నీళ్ళను కడకొంగులో ఒంపమని
బోధించిన సాంప్రదాయపు ఆంక్షలు
ఆచరణలో పెట్టగలనా అనే అనుమానం

చేపట్టిన మనిషి చేరవచ్చిన కుటుంబం
ప్రేమ పంచే నా మంచితనానికి
రక్షణై నిలవాలని ఆశిస్తూ అడుగేస్తున్నా
కడదాకా నన్ను కాపాడమని వేడుతూ...!!

                   అనుశ్రీ....

   .                121

!!ఎదురు చూపు!!

!

ఎన్నో వేల క్షణాల నిముషాల
ఎడబాటు తరువాత నీ ఆగమనం
నా ఎదురు చూపుల పిలుపులు విని
నా  కొరకే  వస్తున్నావేమో అనేలా...!!

ఒంటరి ఆలోచనలతో
చేస్తున్న సావాసం విసుగెత్తి...
ఎదురు చూస్తున్నా నీకోసం
మధుర జ్ఞాపకాల పూవులేవో
నా కోసం తీసుకొస్తావని......

నీ అడుగుల సడి విని అలజడులన్నీ
నీ  తీయని  పిలుపు  విని  ఆవేదనలన్నీ
నీ కనుల వెలుగులో  మదిలో  చీకటులన్నీ
కానరాని  కోనలకు  పరుగు పెడతాయని
ఆశిస్తున్నాను  ప్రతీ సారి...!!

దాచుకున్న ఊసులేవో నీ ఒడిలో
నింపేసి   మురిసిపోయే వేళ
ఆర్తివై ఓదార్పువై-మన్నింపువై మన్ననవై
నను  పలకరించుతావనే
కనులు తెరిచి కలలు కంటున్నా.......!!!

     
         అను-----

వరం

జన్మదిన శుభాకాంక్షలు....!!

నిస్వార్థానికి నిలువెత్తు రూపం
మనసంతా ప్రేమించే గుణం
మాటల్లో హాస్యం
మమత పంచే నైజం.......!!

కష్టంలో పుట్టి పెరిగి
కుటుంబపోషణలో అరిగి
ఉనికిని కాపాడుకునే దిశలో
ఊరుకాని ఊరులో స్థిరపడినా...

ఏరోజూ మమ్ము మరవని
మా మంచి తమ్ముడు...
జీవితంలో ఉన్నతంగా ఎదిగి
సంతోషంగా ఆరోగ్యంగా
తన జీవన పయనం
సాగించాలని కోరుకుంటూ......

ప్రియమైన మా వరంకు
జన్మదిన శుభాకాంక్షలు.......!!

              అనుశ్రీ.....

మే-డే

మేడే శుభాకాంక్షలు.....✊✊✊

రక్తాన్ని స్వేదంగా చిందిస్తూ...
సమాజంలో అడుగడునా..
అన్నిచోట్లా ఉనికిని చూపిస్తూ...
అలసటలు ఆకలి బాధలు
ఎన్నో వెతలు ఎన్నో వేదనలు
ఈసడింపులు మందలింపులు
ఎన్ని ఎదురైనా సహించి
ఎండనకా వాననకా
ఓర్పే ఆయుధంగా కష్టమే జీవనంగా
తమ శ్రమతో సేవలందించే
శ్రామికులందరికీ  మే డే శుభాకాంక్షలు....

         అనుశ్రీ....

           91

ప్రార్థన



నా మొర వినమంటూ
నా మనవి మన్నించమంటూ
నా కలతలను కడతేర్చమంటూ
నా కన్నీళ్ళను ఆపమంటూ..........

అడిగి అడిగి అలసింది మనసు
ఒరిగింది ఓపిక లేని తనువు
నీ పదసేవ తప్ప అన్యమెరుగను
నీ చరణముల నమ్ముట తప్ప వేరెరుగను...

నీ సేవలో తరించింది జీవితం
నీ నీడలో అందించు నిబ్బరం
ఆవేదనను అదిగమించే అడుగులను
నైరాశ్యాలను పారద్రోలే నీ ఆశీస్సులను
అండగా నాకివ్వు చాలు...
నీవిచ్చే ధైర్యమే వెలుగని నిలుస్తా...!!

         అనుశ్రీ....

~మంచిరోజు~



ఆడపిల్లను పుట్టనిద్దాం
చదవనిద్దాం--ఎదగనిద్దాం
హాయిగా బ్రతకనిద్దాం
తనే దేశానికి గర్వకిరణం....

ఇవన్నీ చెప్పడానికి
రాసి చూసుకోవడానికి తప్ప
పాటించేందుకు ఇంకా
ఎంత కాలం ఎదురు చూడాలో...

ఆనాటి సీత కథ
శ్లోకంలో పుట్టి శోకంగా
ముగిసిపోతుంటే అక్కున
చేర్చుకుంది అరణ్యంలోని ఆశ్రమం
పరుగున వచ్చి ధైర్యం ఇచ్చి
 ఒడిలో సేదతీర్చింది కన్నతల్లి...!!

కానీ ఈనాటి మన
చదువు సంస్కారం తెలిసిన సమాజం
ఆడపిల్లని కనడానికి కూడా తల్లిని
భయపెట్టేంత ఎత్తుకు ఎదిగింది....!!

పాఠాలు నేర్చుకునే సమయంలో
ప్రలోభాల పిరికితనాన్ని
నూరిపోసి విశతుల్యమైన
భవిష్యత్తునిచ్చి వికృతానందం పొందే
కొందరు గురువులే దుశ్శాసనులవుతుంటే

పుట్టిన పాప పెరిగీ చదివి
తన స్థితిగతులను మెరుగు పరుచుకునే
దశగా అడుగులు వేస్తుంటే
దారిపొడవునా
రాంబంధులై రాక్షసులై
విచక్షణ మరిచి
అతివను  ఆమెలోని
ఆత్మను అంతమొందిస్తుంటే...!!

కార్చే కన్నీటిలో....పొందే అవమానాలతో
ఆత్మాభిమానాన్ని  వదులుకోలేక
ఏమీ చేయలేక చేష్టలుడిగి
చోద్యం చూసే కన్నా......
పసిగుడ్డుగానే సమసిపోనీ
అని  ప్రతీ తల్లీ సమాధాన పడే
హీనమైన దీనమైన  స్థితిలోకి తీసుకేళుతుంటే...

కరువైపోతున్న ఆడపిల్లను వెతుకుతూ
తగిన జోడు దొరకక ఇప్పటికే అల్లాడుతున్నా
ఇంకా మారని మగసమాజం
ప్రతీరోజూ ఎదురు పడుతూనే ఉంది

అమ్మలా ఆదరిస్తూ భార్యగా ప్రేమిస్తూ
బయట కాలు పెట్టిన మరో
ఆడపిల్ల ఒంటరిగా కనబడగానే
కీచకుల కన్నా దారుణంగా
మాటలతో చేతలతో
స్ర్రీ అంటేనే  ఆటవస్తువని
భావించే మానవ మృగాలకు
కనువిప్పు కలిగే రోజెప్పుడో......

మాతృత్వానికి సోదరభావానికి
విలువిచ్చే మహానుభావులకై
మహిళాలోకపు  ఎదురుచూపులు
ఇంకా ఎన్నాళ్ళో.....!!!

           అనుశ్రీ.....

             125జూ

బాలకార్మిక వ్యవస్థ నిరోధక దినం--

--

నాన్న పాలనలో అమ్మలాలనలో
మురిసి మెరవాల్సిన బాల్యం
బంగారు భవితకై బాటలు వేసుకుంటూ
హాయిగా నడవాల్సిన చిన్నతనం

ఇనుప పనిముట్ల మధ్య
మోయలేని బరువుల మోస్తూ
చితికిపోతూ చతికిల పడుతూ
భారమైన అడుగులతో
కదలలేక అల్లాడుతున్న
చిన్నారి వదనాలలో చిరునవ్వులెన్నడో.....

పేదరికం అజ్ఞానం ఆకలి అన్నీ కలిసి
చిట్టి చేతుల బంధిస్తూ వేధిస్తూ
ముళ్ళబాటను చూపి పయనించమంటుంటే
ధనికుల అహంకారం క్రింద పనివాళ్ళుగా
పసిమొగ్గలు రాలిపోవుట ఆగేదెప్పుడో.....

చట్టాలు.. సంస్కరణలు..శిక్షలు
ఎన్ని అమలు జరుగుతున్నా
అమ్ముడైన మానవత్వం ధనకాంక్ష
ప్రమాదాలతో సహవాసం చేస్తూ
పిల్లల పాలిట శాపమై వెంటాడుతోంది...

పసిహృదయాలపై చేదు ముద్రలు
భవితలో నేర ప్రవృత్తికి ప్రోత్సాహాలు
బాలల మానసిక ఎదుగుదలకు అవరోదాలు
మనసున్న ప్రతి ఒక్కరు స్పందించి
దారుణాలను ఆపి చైతన్య దిశగా
దృష్టిసారించి మంచి పౌరులుగా
కుటుంబానికి దేశానికి అందిచాల్సిన
బాధ్యత మనందరిది......!!

              అనుశ్రీ....

               126

!!సాఫల్యం!!



మల్లెపూవు వంటి మనసు
సుగుణాల  విరిసే సౌరభాలు
సున్నితమైన మనో భావాలు
అన్నీ అందమైనవే
అంతా ఉన్నతమైనవే
అందరూ చూసి ఆనందించేవే.....!!

అందుకునేందుకు ఆశను పెంచుతూ
ఆనందించమంటూ ప్రేరేపించేవే...
కోసుకునే కఠినమైన చేతులకు
కావలసిన లాభాలూ
ఉత్తమ లక్షణాలు ఇవే.......
ఎన్నో సమయాల్లో కష్టాన్ని కొనితెచ్చి
కలతకు కారణమయ్యేవీ ఇవే.....

గాలిసోకినా రాలే పూలరేకులు
విస్మరిస్తే వాడిపోయే వన్నెలు
విలాసానికే వాడితే
వారించేందుకు నోరు కూడా లేక
వేడుకోలు చేసుకోలేక
మౌనంగా విలపిస్తూ కన్నీల్లతో
రాలే మనో రాగమాలికలెన్నో....

భావాలను గౌరవిస్తూ ......
బాధ్యతగా ప్రేమను చూపే......
ఆత్మీయమైన చేతుల్లో  నిలిచి
ఉన్నత స్థానాన నిలవాలనే కోరిక
ప్రతీపూవు మదిలో మెదిలేదే
ఆరాధనకు ప్రతీకలుగా దైవ సన్నిధిలో చెరి
జన్మ సాఫల్యతకై తపన పడేవే
తీరితే దినమైనా జీవితం ధన్యమే....
లేదంటే సుగుణాలన్నీ శూన్యమే...
అది పూవైనా మగువైనా.....!!

       అనుశ్రీ...
        144

!! గమనం !!



ఒక ఒంటరి ప్రయాణం
ఎన్నో కొత్తలని ఎదుట నిలుపుతుంది
విశాలమైన ప్రపంచాన్నోసారి
తనివి తీరా తిలకించమంటుంది...!!

అనంతకోటి జనరాశుల మధ్య
నువ్వెంత నీలోని వెతలెంత అని
లోకమంతా అలమటించే వేదనల్లో
నీ చెంతనున్న చింతలెంత...?
తరచిచూస్తే అణువంత
ధైర్యంచేస్తే దూరంగా పోయేంత....!!

అయినా సరే మనకున్నదే కష్టం
మనం నడిచేదే ముళ్ళబాట
అందరిదీ రహదారే అనిపిస్తుంది
ఆలోచనల అలజడి మొదలైతే
 ఏవేవో సందేహాలు చుట్టుముట్టి
పరిస్థితులతో ఇమడలేక సతమతమై
మదిలో కల్లోలమై కదులుతుంది
లేని అగాధాలేవో చూపిస్తుంది.....

ఏకాంత తీరాన మౌనంలో పయనిస్తూ
ఈ సువిశాలమైన ప్రపంచాన్నోసారి
శోధిస్తే......పరిష్కారాలకై పరితపిస్తూ
పరిభ్రమిస్తున్న హృదయాలెన్నో....
దిక్కు తెలియక సాగుతున్న నడకలెన్నో....
అవగతమయ్యాక  అనిపిస్తుంది....

జీవన గమన సంద్రాన
అలజడి అలలు అతి సహజం.....!!
ప్రతిమదిలో చింతలుంటాయి
ప్రతీ యదలో తెలియని వేతలుంటాయి
అమోదిస్తూ అదిగమిస్తూ
దిగులు భారం పక్కన  పెట్టి
బాధ్యతగా నడిస్తే దూరంకాదు గమ్యం
శ్రద్దగా శ్రమిస్తే అందకపోదు ఫలితం.....!!!

        అనుశ్రీ.....

కరిగే వెన్నెల

కరుగుతున్న వెన్నెలగా
నలుగుతున్న జీవితం
క్షణమొక యుగమై
గతమొక శాపమై
ఆశనిరాశల ప్రవాహంలో
ఆటుపోటుల సంద్రంలో
ఆవిరవుతూ అంతమవుతూ
కనుపాపల దాచుకున్న
కన్నీటి కలల సాక్షిగా
గుండెలో నింపుకున్న
నిరంతర ఆలపనల
విషాద గీతంగా
పలికించే భావాల ఊతంగా
పరుగుతీసే ఊహల రాగంగా
సాగుతూ అలసి
ఆవేదనై ఒదుగుతూ
రోదనై మిగులుతోంది.......!!

    అనుశ్రీ....

!! గతపు వాకిలి !!

Pvr Murty గారి చిత్రం...

!!!గతం!!

గతపు వాకిలిలో  జ్ఞాపకాల ముల్లు
తడిమిన ప్రతిసారీ గాయమై
వదలక వేదించి మనసుతో విభేదించి
కన్నీటి చెలిమినే ఆహ్వానిస్తున్నాయి...!!

గుండె నిండా గూడు కట్టుకున్న బాధ
మౌనగేయమై మదిలో వినిపిస్తుంటే
గొంతులేని భావాలన్నీ గోడులై
రాయలేని సొదలుగా
మనసు కాగితంపై మాసిపోని
రాతలై  మిగిలిపోతున్నాయి...!!

గతానికి వర్తమానానికి మధ్య
విధిరాత  రాసిన కఠికనిజాలు
యదలోతుల నలుగులుతున్న
కల్లోల హృదయాన్ని చూపలేక
కళ్ళని కప్పేస్తున్న  వెతల మేఘాలై
ఏకధాటిగా కన్నీరై కురుస్తున్నాయి....!!

           అను--------

Saturday, 15 July 2017

!! బడి ఒడి !!



హాయిగా ఆడుతూ పాడుతూ
గడిపిన వేసవి సెలవులకి
రెక్కలొచ్చి వీడ్కోలు చెప్పేసాయి....
మొదలైంది మళ్ళీ బడి హడావుడి....!!

ఉరుకులు పరుగుల హంగామాలు
ఆటోలూ స్కూల్ బస్సుల కూతలు
బండెడు పుస్తకాల బస్తాలను మోస్తూ
బిలబిల మంటూ బయలుదేరిన బాల్యాలు.....!

అందమైన గదుల్లో బందీలయ్యేందుకు
కొత్త బట్టల్లో  ముచ్చటగా ముస్తాబై
వెళ్ళలేక వెళ్ళలేక వెలుతున్న బెంగలు.
విజ్ఞాన వనాన చరించబోతున్న రోబోలు..!!

 వానజల్లులలో తడుస్తూ మురుస్తూ
స్వచ్చంగా ఎదగాల్సిన పసితనం
 మట్టి వాసన కూడా తెలియకుండా
వికసించబోతున్న అధునాతనమైన
అద్భుతవర్ణాల కాగితపు పువ్వులు....!!

బంగారు భవితకి కన్నవారి కలలు
అవి నిజం చేయాలంటూ పిల్లల కవాతులు
కరిగిపోయాక బాల్యాన్ని
ఎదిగిపోయాక పెద్దల్ని
మరిచిపోయేంత హోదాలు...
రేపుగానీ బోధ పడని సత్యాలు....!!

     
      అనుశ్రీ...
      128

~~~~~గగన విహారం~~~~~



మబ్బులను తాకాలని ఆరాటం
చినుకులను పట్టుకునే ఉబలాటం
మనసుకు రెక్కలొచ్చి  ఎగురుతూ
అంబరానికి చేతులు చాచినా
అందని ఆకాశం చేతికందేనా
నేలకు దిగివచ్చే మార్గం దొరికేనా...!!

ఆశకో హద్దు కోరికకో కొలమానం
లేకుండా సాగే పయనం
బొమ్మలాటై మిగలదా
గమ్యం దూరమై నిలవదా.......
అవకాశాన్ని అత్యాశకు బలిస్తే
మిగిలేది గాలిలో ఊగిసలాటే......!!

అలుపు తీరిపోగానే ఎగిరిపోయే
భరోసాలను నమ్మి  నిలబడితే
అగాధాలే చివరకు మిగిలేవి
అవమానాలే తుదకు అందుకునేవి
నేల విడిచిన సాము హద్దు దాటి గమనం
రెక్కలు తెగిన గగన విహారాలే.....!!

                  అనుశ్రీ.....

!! తెగింపు !!



అనాదిగా యుగయుగాలుగా
ఇదే ఎదురు చూపులు
ఇవే వేదనల వేడుకోలు
తరాల అంతరాలు మారినా
మారని తలరాతలు........!!

కన్నవాళ్ళనూ తోబుట్టులను
అయినవాళ్ళందరినీ వదిలి
జీవించడానికి వచ్చినపుడున్న ధైర్యం
భయాలను వెలేసి నడిచేందుకు రాదా...!!

నిర్లక్ష్యాల నీలి నీడలను
తిరస్కారాల సత్కారాలను
సంహించిన మనసుకు
తెగించే బలం ఉండదా...!!

కన్నీళ్ళకే కాదు కళ్ళున్నది
కాగడాలై వెలిగేందుకు...
ఓర్పుకే కాదు మనసున్నది
ఓటములను నిలదీసి గెలిచేందుకు....!!

      అనుశ్రీ...
       145

!! అందమైన కావ్యం !!


అందమైన బాల్యం
అపురూపమైన కావ్యం....
ఎన్నిసార్లు చదువుకున్నా
తనివి తీరని తీయని జ్ఞాపకం...!!

చిన్ని చిన్ని అలకలు
చిట్టీ చిట్టి కోరికలు
బుంగమూతి గారాలు
అమాయకపు అల్లరులు
నిన్నని తలవని
రేపటి భయమెరుగని
రంగు రంగుల వర్ణచిత్రం
తలుచుకుంటే ఇపుడు విచిత్రం....

చినుకులతో చిందులు
చిరుగాలితో కబుర్లు
చీకటితో చిరాకులు
చిలకలంటి పలుకులు
సంతోషాలన్నీ మనవేనని
సందడంతా మనదేనని
బాదరబందీలు లేని చిన్నతనం
చివరిదాకా నడిపించేటి ఇంధనం... !!

        అనుశ్రీ...

!! ఆంతర్యం !!



కొన్ని మౌనాలు విరిస్తూ ఉంటాయి
అంతరంగాన ఆవేదనలుగా
ఆడంబరాల చిరునవ్వులుగా
నవ్వులో ఉన్నదంతా సంతోషంకాదు
వేదన  రూపమంటే దుఃఖమూ కాదు
సందర్భాన్ననుసరించి చేసే ప్రదర్శనేమో

కనిపించేదంతా నిజం కాకపోవచ్చు
కనిపించని కోణాలు ఎన్నో ఉండొచ్చు
చూసీ చూడగానే అంచనాలు
గమనించకుండానే ఆరోపణలు
పై పై మెరుగుల చిత్రాలు
భంగపాటునే మిగుల్చుతాయి.....!!

కళ్ళు చూపేదే సత్యమని భ్రమిస్తే
మనసు మర్మం బోధ పడదు
మాటలకందని మౌనాలుంటాయి
కన్నీళ్ళని మించిన వేదనలూ ఉంటాయి
చేతనైతే చేయందించి సాయం చేయి
వెతలు తీర్చే మార్గం వేయి..
 చెలిమితో చేయూతవై ధైర్యాన్నివ్వు...

ఏదీ వల్లకాదంటే మంచి మాటై పలకరించు
అదే అదునని నలుగురిలో
నగుబాటు చేసే మాటల విసరకు
నీలోని అల్పత్వం చూపబోకు.....!!

     
               అనుశ్రీ....
                 133

!!! బంధుత్వం !!!



రోజు రోజుకీ పలచనై
అడుగంటి  పోతున్న
బంధాలను బంధుత్వాలను
తలిస్తే వికలమవుతొంది మనసు....!!

ఎప్పుడో తప్ప కలవరు
ఎన్నాళ్ళయినా తలవరూ
ఏదో ఒక అవకాశంలా
కలుసుకునే అవసరంలా
వచ్చే శుభాలకు అశుభాలకు
కూడా విలువిచ్చే మనుషులే లేరు....!!

ఎవరున్నా లేకున్నా గడుస్తుందనే ధీమా
ధనరాశులపై తామున్నామనే అహం
చేసే చర్యకు కనీసం విచారం చూపని
సంస్కారాలకో పెద్ద నమస్కారం....!!

ప్రపంచాన మన సమయం ఎన్నాళ్ళో
ఉన్నన్నాళ్ళూ చెలిమిగా పలకరిస్తూ
మనలోని మంచిని మనసారా పంచుతూ
బంధాలకు వారధులై నిలవాలి
ముందుతరాలకు బాటను చూపాలి...!!

కాసులకోటలో కదలక బెట్టుచూపితే
చివరికి ఏ బంధానా నీకు చోటు మిగలదు.!!

                      అనుశ్రీ....

                        143

!!తాళం!!



సంతోషాలను మాత్రమే దాచుకుని
బాధలేవీ గుండెని చేరనీకుండా
తాళం వేయడం తెలిస్తే బావుండు
దిగుళ్ళన్నీ బెదిరి పారిపోయేలా......!!

మనసు క్షేమమని మురిసేలాగా
మమతలన్నీ భద్రమని చెప్పేలాగా
మదిని సురక్షితంగా ఉంచుకుని
తాళం చెవిని మెదడులో దాస్తే....
మధుర జ్ఞాపకాల ఖజానాగా
మనసు  నిత్య వసంతమై విరిసేది...!!

కలతలేవైనా వచ్చే ముందే
గడియలన్నీ వేసుకుని
మది గదిలోకి చేరకుండా ఆపేసి
ఆ సమయంకాస్తా గడిచిపోయాక
హాయిగా తలపుల తలుపులు తెరిచి
ఆనందాల డోలికల్లో తేలిపోయే
మంత్రమేదైనా తెలిస్తే బాగుండేది.....!!

నేను కూడా సహన మూర్తిని
ప్రశాంత వదనాన్ని అయిపోనా...
చిరునవ్వు తప్ప చిరాకులు తెలియక
పసితనపు రెక్కలతో విహరించనా.......!!
             
                అనుశ్రీ....
                   134

!!! అందని ఆనందం !!!



ప్రేమవనంలో మల్లెలు
కుప్పలుగా రాలుతాయని
అనుకుంటుంటే విని
తనివితీరా   ఏరుకుని
మాలలల్లాలని వచ్చాను....

కొమ్మ ఊగినా రెమ్మ కదిలినా
సుగంధాల జల్లులని
ముచ్చటగా మురిసిపోతూ
మనసు నది ఉరకలు వేస్తుంటే
దోసిలితో సిద్దమై కూర్చున్నా...!!

వనాన వేచి ఇన్నాళ్ళయినా
నను సోకని పరిమళానికై
ఆరాలు తీస్తుంటే తెలిసింది
వెన్నెలతో  మాత్రమే వన్నెలని...!!

రోజంతా గడిచాకే పండగని
మది భారమయ్యాక తెలిసింది
‌ఆశల ఊసులతో ఎదురుచూసే
పగటి నవ్వును నేనని......
రేయి రంగంటే తెలియని
సీతాకోక చిలుకనని...!!

మలి సంధ్య విహారాలు
  ఎమిటో నేనెరుగనని
ఆరాటాన మనసు
అంతరాలు మరిచిందని...
అందుకోని ఆనందం
ఆమడ దూరానే ఆగిపోయిందని...!

           అనుశ్రీ....
             135ఝూ

.......కవిత్వం......



కాగితం తెల్లనిదే
పదాల పరంపరలే బోలెడు
రంగు రంగుల భావాలై
అక్షరాల సహవాసినులై ఒదిగిపోతాయి....

అక్షరాలు కొన్నే అర్థాలే కోకొల్లలు
కాగితాలే అన్ని ఒలికించే
మైమరపించే అనుభూతులే వేవేలు
స్నేహిస్తూ,ద్వేషిస్తూ, ప్రేమిస్తూ,పూజిస్తూ
మనసు శోధనల జనించిన
మార్మిక మంతనాల కథనాలు....

 కలం ఓదార్పులో కరిగిపోతుంటే
కాలం తెలియదు కనులకు
అణువంత ఆలోచనగా మొదలై
అంతులేని పయనంలోకి తీసుకెళ్ళి
పుట్టుక నుండీ మరుజన్మ దాకా
వాదం నుండి వేదన దాకా
ఎడారుల్ని సెలయేరులని
 ఆగిపోయిన అడుగులని
సాగాల్సిన దారులని స్పృశిస్తూ...

 ఊహాజనితమైన ఉత్తేజమై
కదిలిస్తుంది కవిత్వం
ఒదిగే ఎన్నోభావాలతో
ఎదగమంటుంది
జీవితపు రంగుని రుచిని తెలుపుతూ
నీ ఆలోచనలకు అద్దమై ప్రతిబింబిస్తుంది..

            అనుశ్రీ.....
              140

-----పెద్దరికం-----

చిత్రం సేకరణ రామకృష్ణ బాబాయిగారు....

         
             ~~~~పెద్దరికం~~~~

ఒక చిన్న పలకరింపు ఒక తీయని మాట
ఎన్నో అందమైన అనుభూతులకు
చక్కనైన దారిని వేస్తుంది.....
మనసుని మమతలతో కట్టేస్తూ
అనురాగమైన చెలిమిలా చేరి
పిన్నలనైనా ప్రేమగా చేరదీసే
పెద్దల అండ నిజమైన  అద్భుతం
అలా చేరే కొన్ని పరిచయాల పరంపరలు
ఎన్నటికీ తరగని నిజమైన ఆస్తులు.....!!

బాధల్లోనో సమస్యల్లోనో ఓదార్చి
ధైర్యాన్నిచ్చి ముందుకు సాగమని
అనుభవ సారంతో అందించే చేయూత
భేషజాలు అంటని కల్మశాలు సోకని
ఆప్యాయత పంచే పెద్దల దీవెనలు
నిజంగా జన్మంతా సాగే తోడూనీడలు....!!

ఎదుగుతున్న మొక్కకు అందే నీరులా
సాగుతున్న నావకు చుక్కానిలా
మంచిని నేర్పుతూ ఆశీర్వందించే
అందమైన ఆలయమంటి హృదయాలు
నేను నిత్యం పూజించే మహోన్నతమైన
ఆదర్శవంతమైన మనస్తత్వాలు.......!!!

ఆత్మీయతై  మదిని వెన్నెల నింపుతూ
చల్లని పిలుపుతో  ప్రేమను పంచుతూ
భావాలను గౌరవిస్తూ సంతోషాలకు దారిస్తూ
పొరపాటులను సరిదిద్ది మనోబలం పెంచే
పెద్దరికం అండ ఉంటే అది మన పుణ్యమే
అందరూ అలా ఉంటే ప్రతీ భవితా ధన్యమే..

                అనుశ్రీ.......
                 137

!! చివరి పేజీ !!



బంధాల నుండి బాంధవ్యాల నుండి
ప్రేమల నుండి  స్నేహాల నుండి....
అనంత దూరానికి ప్రయాణం...
ఈలోకం నుండి నిష్క్రమించే తరుణం
అది  ఆసన్నమవుతున్న ఊహే చాలు
మనసుని అగాధాల్లోకి తోసేసి
ఏవేవో ఆలోచనలతో  చుట్టేస్తుంది....!!!

తనువు మాయమైనా తడిమే జ్ఞాపకంగా
కొన్ని హృదయాలనైనా మిగలాలని ఆరాటం
జ్ఞాపకమై ఓ మదిలో నిలవాలనివ్యామోహం
ఏవేవో అంచనాలు ఏవేవో వైరాగ్యాలు
ఏదీ కనిపించదు ఏదీ వెంట నడవదు
కాలగమనంలో  కలిసిపోయే
పరమాణువులా నువు రాలిపోయాక....!!

పూవులుగా నవ్వులుగా నటనలా నిజంలా
చూపించిన భావాలు ఓర్చుకున్న కష్టాలు
అన్నీ శిధిల శరీరంలో సమాధులై మిగలడమే
గంభీర సంద్రంలో  చిన్నచినుకులా రాలడమే
మాయగా మాయమై మరుపై పోవడమే
చివరకు మిగిలే జీవిత సత్యం.....!!

ఏది సాధించినా ఎన్ని సంపాదించినా
ఎప్పుడో లిఖించిన మరణశాసనానికి
మోకరిల్లి ఆమోదించి ఆవిరవడమే
అంగీకారాలతో సంబంధమే లేకుండా
అవకాశాల మాటే వినకుండా
కొనసాగుతూనే ఉన్న యుగాల చరిత్రఇది..

సంజాయిషీలేవీ లేకుండా
నీవు మిగిల్చిన నీడలో
ప్రశాంతంగా నలుగురు సేదతీరుతూ
మధుర స్మృతిగా మదిలో నిలుపుకుంటూ
రాలే కొన్ని కన్నీటి చుక్కల అభిమానమే
తగలబడే   తనువుకింత  గౌరవం
బ్రతుకుపుస్తకం  చివరి  పేజీలో
అంతకు మించి ఏమీ లేదన్నదేి నిజం...!!

                 అనుశ్రీ.....

                   136

!!! బ్రతుకు పుస్తకం !!!



కొందరి ఆనందాలకు
హారతి కర్పూరంలా......
కొందరి అద్వితీయ నటనలకు
బలైన సజీవ సాక్ష్యంగా
కొందరి అవసరాలకు స్నేహాలకు
ముడిపడిన బంధాలకు
విలువిస్తూ నాలో నేను విలపిస్తూ
గడిపిన ఒక్కోక్షణమూ మదికి జ్ఞాపకమే....!!

గత చరిత్ర తిరగేసిన ప్రతిసారి
చేదు జ్ఞాపకాల రుచి తగులుతున్నా
రాబోయే కాలానికి మార్పు కోరుతూ
సహించాలనే ఏదో ఆశ
మనసు వద్దంటూనే ఉంటున్నా
మరో ప్రయత్నమంటూ విన్నపం.....!!

సాగే నదిలాంటి జీవన గమనంలో
అడ్డొచ్చే రాళ్ళు రప్పలుగా ఎంచి
ఓపిగ్గా తెలివిగా అనుభవాలే ఊతంగా
అడుగేయమంటూ మనసిచ్చే సందేశం
మనసారా ప్రతిరోజూ మననం చేస్తూ
ఆచితూచి  ప్రశాంతంగా నడుస్తున్నా...!!!

అయినా ఏదో తెలియని సందేహం
ఏ వేటు పడనుందో అనే భయం
సందేహాలు సంశయాలు సందిగ్ధాలు
ఇలా ఎన్నింటికి ఓర్చుకుంటూ నలిగితే
ఈ బ్రతుకు పుస్తకం చివరి పేజీ వస్తుందో
నడుస్తున్న కథ సుఖాంతం అవుతుందో...!!!

          అనుశ్రీ.....
           

!!!!!శాపం!!!!

నా కవితకు చిత్రంతో స్పందించిన
శ్రీ Pvr Murty గారికి ధన్యవాదాలు...!!

!!!!!! శాపం !!!!!

తెలియని కబంద హస్తాలు
చూడని రాక్షస నేత్రాలు
హింసించే మాటల వేటులు
అనుక్షణం నిరంతరం
అతివల పాలిట శాపాలు
ఆయువున్నంతకాలం భయాలు...

మగ మృగాల దారుణ పోకడలు
మగువల సున్నితమైన మదిలో
భరించలేని అవమానపు గాయాలు...
మనుషులుగా మనలేక మారురూపంలో
మాయవలలేస్తూ వేధించే విషనాగులు
బుసలు కొడుతూ తిరుగుతున్న లోకంలో
భీతిల్లుతూ బెదిరిపోతూ
భరోసా లేని బతుకు పయనం చేస్తుంటే..

బయటకెళ్ళాలంటే భయం
ఇంట్లో ఉండాలన్నా భయం
స్థాయి ఏదైనా స్తోమత ఏదైనా
ఆలోచనల్లో ఎదిగినా
అంతటా అందరూ చెప్పే జాగ్రత్త
ఒక్కటే నువ్వు ఆడదానివని.....!!

సూక్తులైనా సందేశాలైనా
రామాయణమైనా మహాభారతమైనా
చెప్పేదెంత గొప్ప విషయమైనా సరే
పువ్వులో బొమ్మలో పరదాలో
ఎందులోనో దాగాలి....
ఎందుకంటే ఇది రాబందుల లోకం కనుక..

 పేరు ఉంటే వంద మంది
మొహమే ఉంటే వెయ్యి మంది
కాపుకాస్తూ వేల వేల వేధింపులు
అప్రమత్తతై కాపాడుకుంటున్నా
ప్రతినిముషం తరిచి చూసుకుంటున్నా
ఎక్కడి నుంచో వినిపిస్తూనే ఉంటాయి
బెదిరింపుల చావు మేలాలు....
మనసుని మరణానికి దగ్గరచేసేలా....!!

ఎక్కడున్నా ఎలా ఉన్నా
నువ్వు ఆడదానివంటూ ఆక్షేపిస్తూ
భయపడమంటూ సలహాలిస్తుంటే
అసహ్యం వేస్తోంది ఇలాంటి
అరణ్యంలో విచక్షణ లేని
వాళ్ళ మధ్య బతుకుతున్నందుకు..!!

            అనుశ్రీ...
              141

!! జీవితం !!



జీవితం తెలియని పాఠాలని
నేర్పించే గురువు అవుతుంది....!!

కాలంతో  పాటుగా నడిపించే
నిను వీడని  తోడవుతుంది....!!

పాత అనుభూతులు ఎన్నిఉన్నా
కొత్తగా  ప్రతీరోజూ   పలకరిస్తుంది..!!

అరణ్యమై భయపెడుతుంది
పూలవనమై మైమరపిస్తుంది...!!

శత్రువులా కక్ష్య తీర్చుకుంటుంది
మిత్రుడై సాయం అందిస్తుంది.....!!

గెలుపులా ఆశని పెంచుతీంది
ఓటమై ఓర్పును నేర్పిస్తుంది.....!!

కటిక చీకటై కళ్ళను మూసేస్తుంది
వేకువై వెలుగులు నింపుతుంది...!!

సముద్రంలా గంభీరమతుంది
పిల్లవాగై ఉరకలేయిస్తుంది......!!

అంతులేని సమస్యలతో హడలెత్తిస్తుంది
అంతలోనే పరిష్కరించి పండగవుతుంది..!!

వాత్సల్యాల వలలో బిగించి వేస్తుంది
వంచనల వేటులతో విడుదలని ఇస్తుంది..!!!

పుట్టుకై ఆశలతో నడవమంటుంది
మరణమై మధ్యలో ఆగమంటుంది...!!

అంతుపట్టని ప్రశ్నలా ఆకర్షిస్తుంది
చివరి వరకూ రహస్యమై ముగుస్తుంది....!!

            అనుశ్రీ.....

----తపన---



గోరంత నీ ప్రేమకు కొండంత పులకించి
నీ మాటలతో మమతల పందిళ్ళు వేసి
ఆ నీడలో సేద తీరాలని  ఉబలాటం
     నా   మదికి

నిరీక్షణలో గడిచిన ప్రతీ క్షణాన్ని
నీ సమక్షాన  ఆస్వాదించాలని
 ఆరాటం నా  తలపుకి

విసురు చూపుల బాణాలతో
మదిని గాయం చేస్తున్నా
ఒదిగి   ఓరిమితో
బదులడుగుతున్నా..

పరుషమైన పదజాలానికి
ప్రాణం విలవిలలాడుతున్నా
వీడని పాశమైన నీ బంధాన్ని
పట్టుకునే ఉంటున్నా........

కలిసిన ఒక్కోక్షణం కరిగిపోతుంటే
బిగిసిన నీ చేయి విడిపోతుంటే
స్వప్నాల సాకారం ఆపేస్తూ
మాటల తూటాలని పేలుస్తూ
నిర్దయగా నీ అడుగులు సాగిపోతుంటే....

కదలలేని శిలగా ఆగలేక
పరిగెత్తుకు వస్తున్నా
ప్రాధేయపడి నిన్నాపగలనేమో అని...
అలసిపోతున్న నా తపన
అర్థం అవుతుందేమోనని......!!

          అనుశ్రీ....

సెలవు

💧💧💧💧

నీ మనసు పూ వనమై విరియాలని
నిత్య వసంతమై  నిండాలని
గుండెమబ్బు నేనై కన్నీటిని కరిగిస్తూ
మేఘాల జల్లుల ప్రేమగా తడిమాను....

ఎడారి దూరాల నువు వెళ్ళిపోకుండా
చిరుగాలినై నీ చెంత నిలిచాను
కనుమరుగైన నిన్ను కాంచాలని
కలలన్నీ వెలేసి మేలుకున్నాను
ఎన్నిచేసినా తుదకు ఎండమావిగా
మిగిలిన ఆనందాల తలపునేనయ్యాను....!!

కురిసే వరకే చినుకులకు విలువ
ఉదయం వరకే దీపాల మిలమిల
గుప్పెడు గుండెలో నింపుకున్న
కొండంత ఆశలన్నీ ఆవిరైపోయాక
ఆవహిస్తోందిక కన్నులకు మగత
మరుజన్మదాకా మన కలయిక లేదంటూ...!!

          అనుశ్రీ.....
            138
(  ఈచిత్రాన్ని వేసినవారెవరో తెలియదు
కానీ చూడగానే రాయాలనిపించింది
వారికి నా ధన్యవాదవందనాలు....!! )