Friday, 14 July 2017

!!వీడ్కోలు!!



కణంగా జీవం పోసుకునే సమయాన
ఊపిరై నాలో ప్రాణం నిండే తరుణాన
చల్లగా ప్రేమగా తడిమిందో ఆత్మీయ స్పర్శ
నాకు రక్షణై  శిక్షణై నే చూసిన తొలి స్పర్శ
నను సృష్టించిన మా అమ్మ ప్రేమ నిండిన స్పర్శ.......!!

ఈ లోకాన్ని చూపే తొలి దైవాన్ని
తనివితీరా చూడాలని
తపించే నాకనులను
ఈలోకమే చూడనీయనంటూ
వెలేసింది దయలేని ఒక నిర్ణయం...!!

ప్రేమ నింపిన చేయి కనికరించబోదని
అసువులు బాసే వేళే అవగతమయింది
తను కలలు కన్న నా రూపం సరిగ్గా నింపుకోకుండానే
అంతరిస్తున్న నన్ను తలచి
మౌనంగా రోధిస్తున్న అమ్మ బాధ
తీర్చలేక పడుతున్నా
 అంతులేని ఆవేదన....!!

ఆయువు పెంచుకోవాలనే ఆరాటంతో
అమ్మ ఒడిలోని నా పెనుగులాటకి
ముగింపు తప్పదని చెబుతోంది
పోతున్న నాలోని ప్రాణం.....!!
అరచేతుల్లో పెట్టుకుని కాపాడుకుంటారనుకుంటే
ఆడపిల్లనంటూ వివక్షతో
చిదిమేస్తున్న చిన్ని ప్రాణం
కన్నీళ్ళతో చెబుతోంది కడసారి వీడ్కోలు....!!

        అను-----

     8/2/17---

No comments:

Post a Comment