Saturday, 15 July 2017

మమతల వలలో



వెలుగు తోడులేని చీకటి గదిలో
బదులు లేని బందిఖానాలో
నీకోసం మిగులుతున్న
స్థిర నివాసినిని నేను.......!!

 ఆలోచనల మాటున దాగిన ఆవేదన నేను
 బందీనని చెప్పుకోలేని బంధం నేను
నవ్వులతో నలుగుతున్న పువ్వును నేను
నిరాదరణల నిలిచిన నిర్జీవ స్వరం నేను
కల్లోలిత మనసుతో తల్లడిల్లు తల్లిని నేను

నీ పసితనపు పలుకులతో
బ్రతుకు పాట పాడుకుంటున్న
మౌన కోయిలను నేను....
నీ ఆలనలో పాలనలో
జీవం పోసుకుంటున్న
శిలలాంటి తలపును నేను......!!

చేయి పట్టి నడుస్తూ,
కొంగు పట్టుకు లాగుతూ
ఒడిలోకి చేరిన నీ బెంగలు తీర్చ
కంచికెళ్ళని కథలు చెప్పి
నీ  నిస్ప్పహలను పారద్రోలుతున్న
నిజమైన నిబద్దత నేను..

నీ కలలన్నీ నిజం చేయగ కరవాలం చేతబూని కాపు కాస్తున్న అమ్మను నేను
సదా  నీ సంతోషానికై
 తపన పడు తాపసినేను....!!

నీ అడుగులకై పూలబాట లేయగా
పూల వనాల సేవించు తోటమాలినినేను
నా మమతలోని మాధుర్యాన్ని
మనసార పంచగ మరణాన్నే జయించిన
వీరమాతను నేను....!!

           అనుశ్రీ.....
              

No comments:

Post a Comment