Friday, 14 July 2017

వ్యసనం



ఒక్క అడుగు నావైపు
నువ్వు వెయ్యి చాలు...
మిగతా నడకంతా నేనే
నడిపిస్తూ తీసుకెలతా
అంటుంది....
కౄరపు కోరలు తెరిచిన
వ్యసనమనే రాక్షసి....

పిల్లల్ని మరిచిపోమంటుందీ
భార్యనీ వదిలించుకోమంటుంది
బంధాలను తెంచుకోమంటుంది
బానిసవై బ్రతకమంటుంది.....
కాల సర్పమై నిన్నే కబలిస్తుంది....
విషపు నాగై నీ వాళ్ళనూ కాటేస్తుంది...!!

అలవోకగా అలవడ్డ అలవాట్లే
నిన్ను విడక అనుసరిస్తూ
నీ దారిన మళ్ళిస్తాయి...
స్వాభిమానం  గుర్తురాదు
సంతోషానికా అర్థం తేలదు
అయినా సరే నువ్వు మారవు.....!!

చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్టు
ఎప్పుటికో నువ్వు కళ్ళు నలుపుకుంటే
చేసిన అప్పులు తప్పుల చిట్టా
ఆస్తి పత్రమై చేతికందుతుంది.....
నీ సరదాకోసం సై అన్న వాళ్ళెవరూ
నీ  ఉనికిని కూడా గుర్తించరు....
నాడు పిలిచి పిలిచి పీటలేసిన
సన్నిహితులు స్నేహితులే
నేడు గడప కూడా తొక్కనివ్వరు...
చూసినా చూడనట్టు వెళ్ళళ్ళిపోతారు
తెలిసినా తెలియనట్టు ఉండిపోతారు....!!

విలువైన జీవితాన్ని చేజార్చుకుని
విలువ లేక మిగిలిన  నిలువవు
నువ్వవుతావు.....!!!

    

No comments:

Post a Comment