Saturday, 15 July 2017

ని"వేదన"



పరిమళించే నవ్వులు
తీయనైన పిలుపులు
కురిపించే అనురాగం
వినిపించే నీ ప్రతీ రాగం
అంతా అన్నివేళలలా
నాకొరకే అని సంతోషంలో
పులకించి ఊగిపోయాను..

ఆదరించే ప్రేమ
ఆదుకునే ఆప్యాయత
అరమరికలే లేని నీ చెలిమి
అన్నీ నేను మాత్రమే చూసిన
మాధుర్యాలని మురిసాను...

మంచి నీ నైజం
అందరకీ పంచే అమృతం నీచెలిమి
ఎంత పంచినా తరగని ప్రేమనిధి నీది
ఇవ్వాలనే నీ ఆరాటాన్ని వరించి ఆనందమవుతున్న  హక్కుదారులెందరో..

అన్నీ తెలిసినా ఏమీ తెలుసుకోలేక
అర్థం అవుతున్నా అంగీకరించలేక
స్వభావాన్ని సొంతమని భ్రమించిన
 నా అజ్ఞానం అవగతమౌతుంటే
నిజాన్ని నింపుకున్న కళ్ళు
కన్నీటి పర్యంతమవుతుంటే..
నన్ను నేనే తప్పుకు వెళుతున్నా...!

నీ హృదయంలో వెలుగు నిరంతరం
చూడక వెనుదిరిగితే చీకటే గత్యంతరం
కలకాలం నను వీడని తోడుని నీవే
కానీ నీ నీడను నేను కాననే
నిత్యమైన నిదర్శనం
స్మరించుటే మరిచిన మది నేను...!!!

సొంతమనుకున్న నాభావన
సమసిపోయే సమయం కోసం
స్థానం విడిచి స్థాయిని మరచిన
నా అంతరంగాన్ని అంతరించమంటూ
సత్యంతో సహజీవనం చేసేలా
అత్యాశకీ ఆశకీ వ్యత్యాసం తెలిసి
మనసుకి నిబ్బరాన్ని అద్దుకుంటున్నాను..!!
నిశ్చలమైన తలపునై మిగులుతున్నాను...!!

                  అను------
       

No comments:

Post a Comment