Friday, 14 July 2017

--జ్ఞాపకం----

-

జ్ఞాపకమొకటి అడిగింది
 నీ జాడ చెప్పమంటూ......
నిదురరాని నిశీధిలో
మొదలైన నా అన్వేషణ
నిరాశల అనుభవాన్ని
బహుమతిగా తెచ్చింది....!!

ఆశలన్నీ రాశులుగా పోసి
ఆవేదనకు అందమైన రంగులేసి
వాడిన  చిరునవ్వులకు...
కన్నీరైన కనులకు కొన్ని...
కలల మతాబులు ఇచ్చి....
మునుపటి తనమేదో అప్పగిస్తూనే ఉన్నా.....!!

అంతులేని ఆలోచనలతో
అలసిన మనసుని అనునయించి
వెలుగు హారతులు నీకై పట్టుకుని
గమ్యమెరుగని పయనం చేస్తూనే ఉన్నా..

నాకోసమై నువు ఆరాట పడుతున్నట్టు
మమతల మాలలేవో తీసుకొస్తున్నట్టు
పగటి కలలేవో పలకరిస్తుంటే
నిజం కావని తెలిసినా
నిట్టూర్పుల సహవాసంతో
నిబ్బరంగా నడుస్తూనే ఉన్నా....
అంతులేని నా కథకి
ప్రతీ ఉదయం కొత్త పేజీ అతికిస్తూనే ఉన్నా..

       అనుశ్రీ......
             69

No comments:

Post a Comment