Saturday, 15 July 2017

!! విరుద్దం !!



ప్రతిరోజూ ఎదురు పడుతూనే ఉంటాయి
ఎన్నో విరుద్ద భావాల పలకరింపులు
తూర్పూపడమరల్లా సాగే సంభాషనలు
నచ్చని ఆలోచనల ఆలింగనాలు.......
ఎప్పటికి చేతులు కలపని అభిప్రాయలతో
ఎదురుపడ్డ ప్రతిసారీ జీవంలేని చూపులే...!!

తర్జన భర్జనలు ఉండవు...
మొహం మీద చెప్పుకోడాలు ఉండవు
నిజాలను తేల్చుకోవడమూ ఉండదు
ఏళ్ళు గడిచినా కదలని స్థానాలు
కలవని స్నేహాలు
మాటకలిపితే మాత్రం చాటంత నవ్వులు...
పడిపోయేంత ప్రేమలు
జీవితాంతం సాగించే నటనలు.......!!
పగా లేదు  ప్రతీకారమూ కాదు
స్వచ్చతలోపించిన  మనోభావాలంతే..!!

అడుగు మన వైపు పడదు
మనమూ అటువైపు నడవము
అనుసరిస్తే తగ్గిపోయామని.....
అభినందిస్తే ఓడిపోయామని..
ఒకరికొకరం ఇచ్చుకున్నది లేదు
తెచ్చుకునేదీ ఉండబోదు...
అర్థంలేని ఆర్భాటాలు అంతులేని విభేదాలు
పనికిరాని అహంకారపు భేషజాలు...!!

మంచిలో తోడవ్వక బాధలో విలువివ్వక
ఆడంబరాల ఆహ్వానాలకు
పనికిరాని కబుర్లకైతే.....
పైపై ప్రేమల గంధపు పూతలు..
ఆర్భాటాలు చూపే ఆరాటాలు
నలుగురిలో ఒకలాగ మనసులో ఇంకోలా
మెట్టు దిగక బెట్టుని కొనసాగిస్తూ.....
ఆరాలకు మాత్రం నిరంతర పహారాలు...!!

అవసరానికి తగ్గ అభినయాలు
అవకాశం ఇస్తే అవమానాలు
అంతులేని నట సార్వభౌములకు
అసాధ్యమేమీ ఉండదు...!!
సమయాన్ని వృధా చేస్తూ  సాగె
సొరంగ పయనమే తప్ప
ప్రయోజనమెరుగదు ఈ పరిచయం....!!
అక్కరకు రాని సహవాసం
అంతరంగానికి పెనుభారం...
అందుకే నేను దూరం దూరం....!!

          అనుశ్రీ...
              89

No comments:

Post a Comment