Friday, 21 July 2017

!!! వృధ్దాప్యం !!



వయసు పెరుగుతోందంటే దిగులు
అనారోగ్య సమస్యల గుబులు
అసహనం.. అయ్యో అయిపోతోందా
ఇక నా జీవితం అనే ఓ నిరుత్సాహం
అన్నీ కృంగదీసి బాధిస్తుంటే
పేద సంపన్న తేడాలేక అందరికీ భయమే.....

కానీ అయిపోలేదు జీవితం ఉంటుంది
అయిన వాళ్ళ నిర్లక్ష్యాలను భరించాలి
అరిచినా హేళన చేసినా సహించాలి
నిరుపయోగమైన నిలువవు నీవంటూ చూసే చూపులను క్షమించాలి...!!

నీ త్యాగాలు నీవందించిన భోగాలు
కష్టాలను దాటి కన్నీళ్ళను దిగమింగి
నీపై ఆధారపడ్డ జీవితాలన్నింటికీ
జీవం పోసే క్రమంలో ఆవిరైన
నీ కలలు, ఆశలు ,ఆశయాలు ఏవీ
చూసే తీరికలు నీవాళ్ళకు లేవు....

వయోభారంతో వేసే నీ అడుగులకు
బలమయ్యేందుకు ఊతకర్రలు తప్ప
ఆత్మీయ హస్తాలు అనుక్షణం ఉండవు
ఉన్నా నీ ఆత్మాభిమానం ఒప్పుతుందో లేదో

ఎన్నింటినో అధిగమించిన నీ మనోబలం
ఎందరినో సమాధాన పరిచిన నీ తెలివిని
ఇక నీపై నీకోసం వినియోగించితే
నీవే నీకు బలమవుతావేమో....

అందరూ నడిచినదే ఈ దారి....
నీ కన్నా ముందు వాళ్ళు....
రేపు నీ వెనకాల వచ్చేవాళ్ళూ...
అంతా చివరికి ఈతోవన వెళ్ళాల్సిందే..

వృద్థాప్యం మరో బాల్యంలాగా
అనుభవాల సారం లాగా
ముసలితనాన్ని ఈసడించే కళ్ళు ఏడ్చేలా
నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోతూ
పరిపూర్ణమయిన ప్రయాణానికి సాక్షంగా
ఆస్వాదించాలి ప్రతీరోజూ
ఎందుకంటే రమ్మన్నా రాదు మళ్ళీ ఈరోజు

సేవలో పొందే తృప్తి,శాంతి అనుభవిస్తే
ఒక ఆత్మసంతృప్తి మనకు మిగులుతుంది
అది మనసుతో చూస్తే తెలుస్తుంది
ఆ సేవకూడా వరమే అనిపిస్తుంది
గుర్తించకపోవడం ఎదుటి వాళ్ళ ఖర్మ
అది తెలుసుకోని వాళ్ళకై మీ వేదన వృధా....!!

                    అనుశ్రీ....

No comments:

Post a Comment