Saturday, 15 July 2017

!!! బ్రతుకు పుస్తకం !!!



కొందరి ఆనందాలకు
హారతి కర్పూరంలా......
కొందరి అద్వితీయ నటనలకు
బలైన సజీవ సాక్ష్యంగా
కొందరి అవసరాలకు స్నేహాలకు
ముడిపడిన బంధాలకు
విలువిస్తూ నాలో నేను విలపిస్తూ
గడిపిన ఒక్కోక్షణమూ మదికి జ్ఞాపకమే....!!

గత చరిత్ర తిరగేసిన ప్రతిసారి
చేదు జ్ఞాపకాల రుచి తగులుతున్నా
రాబోయే కాలానికి మార్పు కోరుతూ
సహించాలనే ఏదో ఆశ
మనసు వద్దంటూనే ఉంటున్నా
మరో ప్రయత్నమంటూ విన్నపం.....!!

సాగే నదిలాంటి జీవన గమనంలో
అడ్డొచ్చే రాళ్ళు రప్పలుగా ఎంచి
ఓపిగ్గా తెలివిగా అనుభవాలే ఊతంగా
అడుగేయమంటూ మనసిచ్చే సందేశం
మనసారా ప్రతిరోజూ మననం చేస్తూ
ఆచితూచి  ప్రశాంతంగా నడుస్తున్నా...!!!

అయినా ఏదో తెలియని సందేహం
ఏ వేటు పడనుందో అనే భయం
సందేహాలు సంశయాలు సందిగ్ధాలు
ఇలా ఎన్నింటికి ఓర్చుకుంటూ నలిగితే
ఈ బ్రతుకు పుస్తకం చివరి పేజీ వస్తుందో
నడుస్తున్న కథ సుఖాంతం అవుతుందో...!!!

          అనుశ్రీ.....
           

No comments:

Post a Comment