చదివిన చదువుకు
సార్థకతని వెతుకుతూ
సాగించే పయనంలో
అతివకు అగచాట్లు ఎన్నో..
నాటిలా కాదు మేము
నేటి మహిళలమంటూ
బయలుదేరిన మగువకు
ఇంటా బయటా తప్పనేలేదు
అధికార దురహంకారపు వేధింపులు...!!
బాధ్యతలతోనే బంధుత్వం
సేవలతోనే స్నేహం...
క్షణమైనా తీరికలేని
ఒత్తిడులతోనే సావాసం...
విసుగులూ చిరాకులే
బహుమానాలై చేరుతుంటే
ఆత్మాభిమానం ఆక్రందనంతా
ప్రశ్నగానే మిగిలిపోతోంది...!!
కాసులు లేనిదే గడవని కాలం
సంతానం సంసారం సజావుగా
నడిపే ఆరాటంలో
జీతాలకు నెలవైన చోట
జీవితాన్ని తనఖా పెట్టి
జీవనశైలిని గడియారం ముళ్ళులో బిగించి
కాలంతో పరిగెత్తే మహిళా...
నీ చేతులు రెండైనా చేతలు పలుగా..
నిత్యకృత్యమైన నీ పరిక్షలో
ఉత్తీర్ణత ఎంత ఉందో గానీ
ధరిత్రికి సమం నీ సహనం...!!
అను------
39

No comments:
Post a Comment