ఒక చిన్న ఆత్మీయ స్పర్శ
ప్రేమగా ఒక పలకరింపు
ఆశించమే తప్ప యాచించడం
చేతగాని ఒంటరితనపు మలి వయసులో....
పక్కన కూర్చుని కాస్త ప్రేమను పంచాలని
క్షేమమా అని అడిగితే ఇంకో నాలుగునాళ్ళు
ఆనందంగా గడిపేయాలని ఆరాట పడ్డ ఆశ..
నిరాశల చేదు రుచిని చూసి విసిగి వేసారి
మృత్యువు ఒడిలోనే ఇక
సేద తీరాలని నిష్ర్కమించింది.......!!
ప్రాణాలను అరచేతుల్లో దాచుకుని
నా దరికి వచ్చి ప్రేమచూపే
ప్రియమైన వారందరి కోసం
నేను చూసిన ఎదురు చూపులు
మీ మాటలకై పడిగాపులు పడిన
నా అంతరంగపు ఆందోళనలు
ఇవేవీ గుర్తించని నా రక్తబంధానికి తెలుస్తుందా నాలోని యాతన
చేరలేని దూరాల నే చేరినరోజైనా....?
కానరాని తీరాల నే వెళ్ళినరోజైనా....?
మీ రోదనలు మిన్నంటినా
కన్నీళ్ళతో కడవలు నిండినా
అవేదనే ఆయువుగా చేసుకుని
ప్రాణం నిలుపుకున్న నా శరీరానికి
తనువును వీడి దూరమవుతున్న
కలతతో కరిగిపోతున్న మనసుకు
మీ పిలుపులు చేరవు
ఏ అరపులూ నను మీ చెంత నిలపవు...!!
కోరినప్పుడు అందని అనురాగం
వేడినప్పుడు రాని కనికరం
కట్టెల్లో కట్టెగా నేను కాలిపోతూ
అగ్నిలో బూడిదయ్యే వేళ
మీరు ప్రదర్శించే అభిమానం
పూల పల్లకీలో ఊరేగింపులు
బ్రతికుండగా నాకివ్వని మనశ్శాంతి
నే సమసే తరుణాన మీ డాబులు మాత్రమే..!!
అనుశ్రీ.....

No comments:
Post a Comment