నిన్నటి గతం నాన్న
రోజూ ఒక జ్ఞాపకం నాన్న
కలలో తప్ప కళ్ళకు కనబడక
దిగులులో బెంగలో
మరీ మరీ తలపుకొచ్చే నాన్న...
గుర్తులుగా మాలో మెదులుతూ
ఎక్కడో నువ్వు ఇక్కడే మేము...!!
నువ్వుంటే నాలో భయాలు జడిసేవి
నువ్వుంటే లోకం అందంగా కనిపించేది
నీ పచ్చని నీడలో కాలం హాయిగానం చేసేది
మాలో పసితనం వాడక విరబూసేది...!!
బాధ్యతలన్నీ మోసే భరోసాని చూసుకుని
అమ్మ లో ఆనందం కనిపించేది
కొండంత అండలా నీ మాట
సాటిలేని మమతలా నీ దీవేన.......!!
సమయం గడుస్తున్నా సమసిపోని
అనంతమైన అనురాగం నీది
నీ ప్రేమలో మురుస్తూ
గడిపేకాలం ఈ జన్మకు లేదు
నువ్వు వదిలి వెళ్ళిన స్మృతులు
నీతో గడిచిన ఆ రోజులు
ఇవే మాకున్న ధనం
కనిపించని దైవంలా లోకాన్ని వీడినా
నీ కరుణామృతంతో మము నడిపించు
తీరైన తోవలో పయనించే బలమివ్వు
మాలోనే నువ్వున్నావన్న ధీమానివ్వు.....!!
అనుశ్రీ.....
132

No comments:
Post a Comment