Saturday, 15 July 2017

!!! సాయం !!



మండు వేసవి..........
మాటిమాటికీ దాహం...
చల్లదనం కోసం
శరీరం పడే  ఆపసోపాలు...!!

సూర్యదేవుని  ప్రతాపంతో
ఆవహించే  అలసట  నీరసం
అవి  తీర్చుకునే  ప్రయత్నంలో
శీతలపానీయాల సేవనం...
అందరమూ తరచూ చేసేదే....

ఏవేవో రసాయనాల మిళితమైన
రంగురంగుల నీళ్ళు తాగడంవల్ల
ఆరోగ్యానికి అపారమైన నష్టం...
వ్యాపారుల జేబులు నింపుతూ
మన ఒంట్లో శక్తిని ఖాళీ చేసుకోవడం...!!

అందుకే స్వచ్చంగా లభించే
ప్రకృతిమాత ప్రసాదంగా భావించి
కొబ్బరినీళ్ళతో గొంతు తడుపుకుంటే
మన శరీరాన్నీ రక్షించుకున్నవాళ్ళవుతాం..!!

ఎంతో మంది చిరు వ్యాపారులకు
మేలు చేసినవాళ్ళమవుతాం
రైతులకు కాస్తైనా ఊరటనిచ్చి
చేతనైనది చేసిన వాళ్ళవుతాం....

చిన్న చిన్న తోపుడు బండ్లపై
మండే ఎండలో కూడా
విశ్రాంతి మానేసి పొట్టకూటికోసం
తమ వద్దకు వచ్చే కొనుగోలుదారులకై
ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు...

వెలకట్టలేని కష్టం తమది
అయినా సరే వచ్చే ఆదాయమే
బతుకుబండికి ఇంధనంగా
భరోసానిచ్చే  సాయంగా చూస్తుంటారు..

చల్లటి గదులు అందమైన దుకాణం
చేతికింద పనివాళ్ళు-సేదతీరే సౌకర్యాలు
ఏవీ లేకుండా ఏళ్ళ తరబడి
మన కళ్ళముందు పడిగాపులుపడే
పేద జీవితాలకు  ప్రత్యేకంగా ఏదీ చేయలేకపోయినా ఇదీ ఒక సాయమే...!!

       అనుశ్రీ....
         92

No comments:

Post a Comment