Thursday, 20 July 2017

!! చివరి మలుపు !!

అమ్మా అని పిలవడం ఎంత అదృష్టమో
పిలిపించుకోవడమూ అంతే అదృష్టం..
ఆ ప్రేమలోని మాధుర్యాన్ని
తనివితీరా చూడాలంటే
ఒక జన్మ సరిపోదేమో అనిపిస్తుంది...
అమ్మగా జీవించడంలోని ఆనందం..
లోకాన్ని మరిచి విహరించే స్వర్గం..!!!

పిల్లల బోసినవ్వుల్లో విరిసే పువ్వులు
వచ్చీరాని మాటల కబుర్లు
పసితనపు గారాబాలు....
వాళ్ళ కథలో కథా నాయిక అమ్మే
అమ్మగా మారాకే నిజంగా
అమ్మ ప్రేమంటే తెలిసేది...........!!

పిల్లలని తీర్చిదిద్దడంలో ప్రథమస్థానం
వాళ్ళ ఎదుగుదలకై పడే తపన
వృద్దిలోకి తేవాలని ఆరాటం
ఆణిముత్యాలుగా చూడాలనే అభిలాశ
భవిష్యత్తు బంగారం చేయాలనే ఆశ
ప్రతీ తల్లి మదిలో నిరంతరం కలవరం....!!

చూస్తుండగానే భవిష్యత్తు పరుగులో దూరమైన వేళ వారించలేక ఊరుకోలేక
ఆ తల్లి పడే  ఆవేదన వర్ణనాతీతం
కళ్ళముందు ఆడిపాడిన పసితనం
ఎక్కడో ఒత్తిడిలో నిర్విరామ శ్రమలో
కనిపించడమే వరమై కలవరింతల పరమై
బాల్యపు గుర్తులనే ఆసరా చేసుకుని
మనసుని ఆదీనంలోకి తెచ్చుకోవటమే పని..

ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని
సంతోషంగా గడపాలని
కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ
కలతలని కడుపులో దాచుకుని
వాళ్ళు మిగిల్చిన వెలితిని
జ్టాపకాల పేజీలో అక్షరాలుగా మలచుకుని
కలిసిన రోజులని ఆస్వాదిస్తూ
ఆశీర్వదిస్తూ కొనసాగడమే
  అమ్మకు  మిగిలే చివరి మలుపు....!!

       అనుశ్రీ....

No comments:

Post a Comment