మితిమీరిన తొందర శృతిమించిన వేగం
కదలలేని బొమ్మలుగా చేసి
రోడ్డుమీద విసిరేస్తున్నా.....
మీ కళ్ళముందే ఎన్నో ప్రాణాలు
గాలిలో కలిసిపోతున్నా
నేరమని చెప్పినా హెచ్చరించి ఆపినా
లెక్కచేయక--మార్పు చెందక
కన్నవాళ్ళ ఆశలని కన్నీట ముంచుతూ
గగనానికెగసి విషాదాంతమవుతున్న
పసి ప్రాయం వీడని ఆయువులు....!!
తెలిసికూడా తప్పును చేస్తూ
తమతోపాటు మరో ప్రాణాన్ని
బలితీసుకుంటూ
రహదారులపై రుధిరపు మరకలై
మత్తులో చిత్తవుతున్న జీవితాలు....!!
మెడలు వంచి పయనిస్తూ
చరవాణిలో సంభాషిస్తూ
ధ్యాసెక్కడో గమనమెక్కడో మరిచి
పొంచి ఉన్న మృత్యువును వెంట పిలుస్తూ
మాయమైపోతున్న జీవనాలు
ఆత్మీయులకు మిగిల్చే
మరిచిపోలేని మరణ వేదనలు...
కోరి తెచ్చుకుంటున్న అనర్థాలు....!!
సౌకర్యాన్ని వినియోగించుకోవాలి
సంతోషాలకు చిరునామాలుగా
మధురమైన జ్ఞాపకాలుగా
తోటివారికి సహాయాలుగా...!!
ఎంతో విలువైనది జీవితం
క్షణికమైన ఆనందం కోసం
కాకూడదు అది అంతం......!!
మీ తప్పు కాకూడదు మరో ఇంటి శాపం..!!
అనుశ్రీ.....
78


No comments:
Post a Comment