Sunday, 16 July 2017

~మంచిరోజు~



ఆడపిల్లను పుట్టనిద్దాం
చదవనిద్దాం--ఎదగనిద్దాం
హాయిగా బ్రతకనిద్దాం
తనే దేశానికి గర్వకిరణం....

ఇవన్నీ చెప్పడానికి
రాసి చూసుకోవడానికి తప్ప
పాటించేందుకు ఇంకా
ఎంత కాలం ఎదురు చూడాలో...

ఆనాటి సీత కథ
శ్లోకంలో పుట్టి శోకంగా
ముగిసిపోతుంటే అక్కున
చేర్చుకుంది అరణ్యంలోని ఆశ్రమం
పరుగున వచ్చి ధైర్యం ఇచ్చి
 ఒడిలో సేదతీర్చింది కన్నతల్లి...!!

కానీ ఈనాటి మన
చదువు సంస్కారం తెలిసిన సమాజం
ఆడపిల్లని కనడానికి కూడా తల్లిని
భయపెట్టేంత ఎత్తుకు ఎదిగింది....!!

పాఠాలు నేర్చుకునే సమయంలో
ప్రలోభాల పిరికితనాన్ని
నూరిపోసి విశతుల్యమైన
భవిష్యత్తునిచ్చి వికృతానందం పొందే
కొందరు గురువులే దుశ్శాసనులవుతుంటే

పుట్టిన పాప పెరిగీ చదివి
తన స్థితిగతులను మెరుగు పరుచుకునే
దశగా అడుగులు వేస్తుంటే
దారిపొడవునా
రాంబంధులై రాక్షసులై
విచక్షణ మరిచి
అతివను  ఆమెలోని
ఆత్మను అంతమొందిస్తుంటే...!!

కార్చే కన్నీటిలో....పొందే అవమానాలతో
ఆత్మాభిమానాన్ని  వదులుకోలేక
ఏమీ చేయలేక చేష్టలుడిగి
చోద్యం చూసే కన్నా......
పసిగుడ్డుగానే సమసిపోనీ
అని  ప్రతీ తల్లీ సమాధాన పడే
హీనమైన దీనమైన  స్థితిలోకి తీసుకేళుతుంటే...

కరువైపోతున్న ఆడపిల్లను వెతుకుతూ
తగిన జోడు దొరకక ఇప్పటికే అల్లాడుతున్నా
ఇంకా మారని మగసమాజం
ప్రతీరోజూ ఎదురు పడుతూనే ఉంది

అమ్మలా ఆదరిస్తూ భార్యగా ప్రేమిస్తూ
బయట కాలు పెట్టిన మరో
ఆడపిల్ల ఒంటరిగా కనబడగానే
కీచకుల కన్నా దారుణంగా
మాటలతో చేతలతో
స్ర్రీ అంటేనే  ఆటవస్తువని
భావించే మానవ మృగాలకు
కనువిప్పు కలిగే రోజెప్పుడో......

మాతృత్వానికి సోదరభావానికి
విలువిచ్చే మహానుభావులకై
మహిళాలోకపు  ఎదురుచూపులు
ఇంకా ఎన్నాళ్ళో.....!!!

           అనుశ్రీ.....

             125జూ

No comments:

Post a Comment