Saturday, 15 July 2017

ఆశాదీపం



ఏ వెలుగులూ ప్రసరించని నిశీధిలోనూ
ఒక దీపం వెలుగుతూ ఉంటుంది
అదే మనసున  కదిలే ఆరని ఆశ
నిరాశను సాగనంపే చిరు కిరణం......

బ్రతుకు భయం ఆవహించినప్పుడు
దారులేవీ తెలియక తికమక పడ్డప్పుడు
అంతరంగాన అలజడి మొదలైనప్పుడు
అగ్ని కణమంటి బాధ లోంచి పుట్టి
ఆరని జ్యోతిలా మారుతుంది..
మారని నైజమై నిన్ను ఆవహిస్తుంది...!!

ఏ బలమూ వెంటరాదని అంగీకరించాక
కన్నీళ్ళింకి పోయి గుండె దిటవయ్యాక
ఏదైనా జరగనీ అని స్థిమితపడ్డాక
ఆ నిర్ణయం నుండే మొదలవుతుంది
ఎదురుతిరగక తప్పదనే ఆలోచన
ఎదురీతను నేర్పి సాగిపోయేలా......!!

ఎవరూ వచ్చి ఇవ్వని ధైర్యం
ఎక్కడా దొరకని తెగింపు
నీలోంచే నిబ్బరమై పుడుతుంది...
గెలిచే తోవను చూపి నడవమంటుంది....!!

             
అనుశ్రీ...

No comments:

Post a Comment