స్ర్రీకి స్ర్రీయే శత్రువు అని నానుడి
ఇది తరతరాలుగా వింటున్న మాట
తన మూర్ఖత్వానికి అతి తెలివికి
చదరంగంలో తానూ ఒక పావులా మారితే
మరో ఆడదే బలి అవుతుంది.......!!
అమ్మగా అమృతాన్ని పంచుతుంది
అత్తగా విషాన్ని చిమ్ముతుంది
అక్కగా ఆదరణ చూపుతుంది
ఆడపడుచుగా వేదన నింపుతుంది
స్నేహితురాలిగా ప్రేమను ఇస్తుంది
శత్రువై కత్తులూ దూస్తుంది
అన్నీ తనే అన్నికోణాలూ తనవే
ఒక చోట తీయని బంధంగా
మరో చోట చేదు బంధనంగా..
కొడుకుకు కిరీటాలు పెట్టాలనే ఆశలో
కోడలుకు గుదిబండలా మారుతుంది
అన్నకు లేని పట్టమేదో కట్టబెట్టాలని
ఆడబిడ్డగా బెట్టుతో బెదరగొడుతుంది
అచ్చం ఇలాంటిదే మరోకోణం
ఇలాంటివే బలహీనతలు ప్రలోభాలతో
అన్నతోనో తమ్ముడితోనో భర్తతోనొ
చనువుగా అనువుగా మరో ఆడది
కంట పడిందంటే ఇంక అంతే...
కన్నుమిన్ను మరచి ఎదుట ఉన్నది
సాటి ఆడదేనన్న మాట మరచి
వీరత్వం శూరత్వం చూపించి
తన సంసారం చిన్నాభిన్నం చేసేదాకా
పదిమందిలో పరువు తీసేదాకా నిద్రపోదు..
బుద్ధిచెప్ఫాలి న్యాయమూ చేయాలి
కాపురాన్ని కాపాడాలి కష్టం తెలపాలి
ఆడవాళ్ళుగా ఆడవాళ్ళని రక్షించాలి
సమర్థించిన వారిని ప్రోత్సహించిన వారికి
బ్రతుకంతా గుర్తుండే గుణపాఠం చెప్పాలి
అందుకు కారణమైన మగవారి బుద్ధిని
మోసపూరిత ముఖాన్ని నిలదీయాలి...!!
ఏ అపోహలు ఆవహించాయో
ఏ మాయమాటల వలలో పడిందో
ఏ పరిస్థితి అంతకు దిగజార్చిందో
ఏ కల్లబొల్లి మాటలకు భ్రమసిందో
ఏ కపట నాటకానికి తాను బానిసయ్యిందో
అనే ఆలోచన ఆ క్షణాన మదికి రాదు...!!
ఆవ్యూహంలో చిక్కి దారి తప్పి
రోడ్డుమీద బిడ్డలతోపాటు పడ్డ అతివకు
కళ్ళకంటిన పొరల్ని తొలగించి
మంచిదారిన నడిచేందుకు ఊతమివ్వాలి
దిక్కు తెలియక అలమటించే అభాగ్యులకు
ఈ పాపాల ప్రపంచంలో మరో అన్యాయం
అవమానం మనమూ చేస్తే ఎలా...
మనల్ని మనమే సంహరించుకునే
విషపు సంస్కారం మనలో పోవాలి
వంచించి అబాసుపాలు చేసిన
మగ మృగాన్ని వదిలేసి...గతితప్పి
పంచన చేరిన లేడిని వేటాడ్డం న్యాయమా?
అనుశ్రీ....
96

No comments:
Post a Comment