దేవుడు నాకొక పాత్రనిచ్చాడు
విజయవంతంగా,అర్థవంతంగా
పోషించమని.
అది నీ భార్యగా నా పాత్ర
నువ్వు నేను కలిసిన మన జీవితంలో
నా పాత్రని నేను ఆలోచిస్తున్నా..
నాలా ఉండడాన్ని హరించిన
నీభార్య పాత్రలో
నేనెలా విజయవంతం కావాలో తెలియట్లేదు...!!
మూడుముళ్ళ బంధంతో ఏడడుగుల చేరువలో , నీ పరిధి దాటని నాలో నేనెప్పుడో మాయమైపోయాను...!!
కనిపించని చెరసాలలో యావజ్జీవశిక్ష అనుభవించేవాళ్ళకు తప్ప అర్థం కాదు..!!
నువ్వు మంచి వాడివైతే నేను చాలా అదృష్టవంతురాలినట...!!
లేదంటే అంతా నాతలరాతేనట
నా తలరాత రాసేది బ్రహ్మ కాదు నువ్వేగా..!!
నువ్వేలాంటి వాడివైనా,
నాతో నీ ప్రవర్తన ఎలా ఉన్నా,
నేను సహనంగా మౌనంగా ఉంటే
ఉత్తమ ఇల్లాలినేనట,
ఎదురుతిరిగితేనే వింతనట..!!
నీకు వ్యసనాలతోనో ,నీ నిర్లక్ష్యంతోనో
జరగకూడనిది ఏదైనా జరిగాతే..
నా మాంగళ్య బలం సరిగ్గా లేకేనట,
వైధవ్యం నా నుదుటిపై రాసిపెట్టుంటే నువ్వు కూడా ఏమీ చేయలేవట...!!
చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తున్నా
ఏదో ఒకరోజు నువ్వు మారుతావని
ప్రతిరోజూ ఎదురుచూడాలట
నేను మాత్రం మారకూడదట..!!
ఏదైనా ఒకరోజు నువ్వు మారితే అదృష్టం అనుకుని వెంటనే ఖచ్చితంగా
నీ సేవమొదలుపెట్టాలట..
నా జ్ఞాపకాల్లో నువ్వు చేసిన గాయాల మంటలు నన్ను కాలుస్తున్నా సరే..!!
కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!
నా గురించి మాట్లాడే వాళ్ళు వేరెవరో కాదు, నాదగ్గరి వాళ్ళే, నా కష్టం, నష్టం, కన్నీళ్ళు చూసిన నావాళ్ళే, రోజూ నన్ను గమనించే నా సొంతవాళ్ళే..!!
వాళ్ళందరికీ నువ్వు పెట్టిన పేరు "సమాజం"
ఆ సమాజానికి నువ్వేందుకు విలువిస్తావో కూడా తెలుసు, తప్పెవరిదైనా
శిక్ష నాకేవేస్తుంది కదా మరి..!!
ఆ శిక్షకు భయపడే కదా
అందరూ నీ వశమయ్యేది..!!
అంతఃపురంలో బంగారు సీతకు
కన్నీటి నీరాజనాలు పట్టినా,
అడవుల్లో సీతకి కష్టాలు తప్పలేదు కదా..
అదే సమాజం అదే భార్య పాత్ర..
బహిరంగంగా బంగారు సీతను కాను
కానీ నా అంతరంగంలో అరణ్యరోదనే
అది నువ్వు వినకున్నా,
నేను మునుగుతున్నా
నిన్ను మాత్రం సరైన తీరానికి చేర్చడమే
నా కర్తవ్యం, పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చే ఉత్తమ ఇల్లాలిని కావాలిగా మరి..!!
పుట్టింటి నుండి ఇంటి పేరుని కూడా తెచ్చుకోని
నా పాత్రకి న్యాయం అదేగా..!!!!!
అను-----
17-4-2015

No comments:
Post a Comment