ఆకాశమంత దిగులు సముద్రమంత నిరాశ
నడవలేని అలసట నిలబడలేని అశక్తత..
ఆలోచనలన్నీ ఆవహించి ఆగమంటుంటే మనసుతో తనువూ చలనం మానేసింది...!!
రెక్కలున్నా ఎగరలేక దిక్కులున్నా దారిలేక
ఏదో నిర్లిప్తత ఆవహించి కదలలేని బొమ్మగా
ఒంటరితనంలో నను సేదతీరమంటోంది
ఇదే హాయంటూ ఆగిపొమ్మంటోంది....!!
ఒక్కోక్షణం గడుస్తుంటే ఒక్కొక్క దిగులు
మది దాటి బయలుదేరుతుంటే.
మళ్ళీ ఏదో ఆరాటం తేరుకోమనే సంకేతం
మది నుండి పదే పదే అందుతోంది.....!!
అలజడులెన్నున్నా అడుగేయక తప్పదని
కాంక్షల దారుల్ని దాటిన అడుగు
కర్తవ్యాల బాట పట్టక మానదని
ఉత్సాహం తెచ్చుకోమంటోంది జీవితం..
లేవాలి నడవాలి అవసరమైతే
మనసుతో యుద్దం చేయాలి
వైరాగ్యానికి విషయాలను బోధపరిచి
తక్షణమే సశరీరంగా సిద్దమవ్వాలి ...!!
బ్రతుకు సమరం సాగించడానికి...
భవితకై భరోసాని వెతుక్కుంటూ
జడత్వాన్ని తరిమేసి
జీవించడంలో నిమగ్నమవ్వాలి....
గెలుపు తలుపులు తెరచాకే ఆగాలి
విజయాల పేజీలను రాస్తూ విశ్రమించాలి...!!
అనుశ్రీ....

No comments:
Post a Comment