ఆశల హలాలు చేతపట్టి
అరచేత అంచనాలు లెక్కబెట్టి
నుదుటిరాత మార్చుకోను
వ్యవసాయం కోరుకుంటే
చుక్కనీరు కానరాక
దిక్కుల పహారానే
రైతన్న కు దినమై గడుస్తోంది....!!
ఎండకోర్చి వానకోర్చి
కాలం మరిచి-కష్టం మరిచి
పాటుపడిన పంట పొలం
నెర్రెలు బాసి నోరు తెరిస్తే
కరుణించని ప్రకృతి
కంట్లో కునుకును లాగేస్తుంటే
ఎదురు చూపే అలసిపోయి
ఎండమావై పలకరించె.......
ఆవిరైన ఆనందం
అందనన్న అదృష్టం
చెరువైపోతున్న గుండెకు
గుక్కెడు నీళ్ళ జాడ కానరాక
నింగికి వెళ్ళిన చూపులు
నిరాశలే మోసుకొస్తుంటే
పండిన పంటలో పండగల్ని చూసుకునే
సంబరమే కానరాక కన్నీరే ఒలుకుతోంది
అనుశ్రీ
4-3-17

No comments:
Post a Comment