స్వర్ణకారులు
సాటి లేని మేటి కళాకారులు...
వన్నెలకే వర్ణాలు అద్దే
అచ్చమైన అసాధ్యులు..
అయినా సరే కష్టం తప్పని
శ్రామికులు.........!!!
లక్షల విలువైన ఆభరణాలను
అలవోకగా అందంగా మార్చేస్తూ....
లక్షణమైన జీవితాన్ని
లాగలేక కూలుతున్న
గాంభీర్యపు అగచాట్లు.......!!
వీసమంత నగకు సైతం
సొగసులతొ విలువని పెంచి
బ్రతుకు బాటలోని ముళ్ళని మాత్రం
ఇసుమంతైనా కదిలించలేక
గాయాల పయనంలో మాయమవూతూ
సాగుతున్న బాటసారులు.......!!
వృత్తి పై మమకారాన్ని వదులుకోలేక
అలవడ్డ ప్రవృత్తి మార్చుకోలేక
చెప్పుకున్నా వినే నాధుడే కానరాక
గొంతు విప్పే సాహసం చేయలేక
పాదరసానికే ప్రాణాలు అర్పిస్తున్న
ప్రగతి మరిచిన ప్రమిదలు....!!
బంగారం ధర పెరిగింది
వ్యాపారుల ధనం హెచ్చింది
విలువలేని ఇనుము కూడా పుత్తడిపూతతో
అద్దాల మేడల్లో అమరింది
ఆదరణ కరువై సంపాదన బరువై
నమ్ముకున్న నీడలోనే నలుగుతూ
విలువలకు బలైపోతున్న
వీరబ్రహ్మేంద్రుని వారసులు......!!
అనుశ్రీ.....

No comments:
Post a Comment