Wednesday, 12 July 2017

!!! సందేశాల దూత !!!


      (మెసేంజర్)

మన ఆధీనంలో ఉన్నంత వరకూ
మనసుకి ధీమా అందిస్తుంది
స్నేహ హస్తాలని జోడిస్తుంది
సుదూర తీరాలని సైతం
చిన్న పలకరింపులతో చేరువ చేసేస్తుంది
ఎన్నో ఆప్యాయతల  మణిహారాలని
బహుమానాలుగా ఇస్తుంది.......!!

తెలియని బాంధవ్యాలను
బలపరుస్తూ ధైర్యమై నిలుస్తుంది
ఆత్మవిశ్వాసాన్ని  నింపుతుంది...
సలహాలకు సంప్రదింపులకు
చక్కటి వారది లా నడిపిస్తుంది....
ఒంటరి ప్రయాణంలోనూ జంటగా
కబుర్ల కాలక్షేపమై కాలాన్ని మరిపిస్తుంది..
సందేశాల ప్రవాహమై సంతోషాలని ఇస్తుంది.

మంచినే ఎంచుకుంటే అంతా శుభమే
పొగడ్తలకు పొంగిపోయి మైమరచామంటే
పలకరింతగా మొదలై ప్రశ్నలెన్నో సంధిస్తుంది..సమయాన్ని భోంచేస్తుంది
సందర్భాలనెరుగక విసిగిస్తుంది
మర్యాదగా మొదలై మాటల్లో పెడుతుంది
మతి భ్రమణం చేయిస్తుంది
ఆకతాయిల చేయిలో మంత్రమై
అబద్దపు వచనాల వలవేస్తుంది
మూర్ఖత్వమో అమాయకత్వమో
ఎదుటి వారి అసలు రూపు తెలియక
వేదింపుల వలలో పడిన జనులెందరో...!!

తెలివిగా వ్యవహరిస్తే తెలియనివెన్నో
తెలుసుకోవలసినవెన్నో నేర్పిస్తుంది....
అతిగా అలవరుచుకుని హద్దులు మీరితే
వ్యసనమై మనసును వికలం చేస్తుంది....!!
ప్రమోదమని ఆమోదించి ప్రతిక్షణం
పాకులాడితే ప్రమాదమై ముంచేస్తుంది.....
జాగ్రత్త అప్రమత్తత  అన్ని వేళలా
ఆచరిస్తే ఆనందమై  నిను అనుసరిస్తుంది..!!

         -----అనుశ్రీ----
         

No comments:

Post a Comment